కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. ఎంతో మంది చిన్న, మధ్య తరహా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. అలాంటి వారిలో ఆ మహిళ కూడా ఉంది. అయితే తాను వ్యాపారం చేసుకుంటానని లోన్ కావాలని ఆమె ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ యజమానులను అడిగింది. కానీ వారు లోన్ ఇచ్చేందుకు షరతులు పెట్టారు. ఒక వ్యక్తి ఆమెకు లోన్ ఇవ్వాలంటే తన కోర్కె తీర్చమని కూడా ఆమెను అడిగాడు. ఈ సంఘటన పూణెలో చోటు చేసుకుంది.
పూణెకు చెందిన గోవింద్ కిషన్ రావు సావంత్, గౌతమ్ శీర్షత్ లు మరో మహిళతో కలిసి పూణెలో లోన్లను ఇస్తామని చెప్పి ఓ ఫైనాన్స్ సంస్థను నెలకొల్పారు. తమ కంపెనీకి చెందిన యాడ్స్, హోర్డింగ్స్, ఫ్లెక్సిలను కూడా నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ వ్యాపారం చేసుకునేందుకు రూ.5 లక్షలు లోన్ కావాలని వారిని అడిగింది. అయితే వారు అందుకు ముందుగా రూ.5,500 ఫీజు చెల్లించాలని చెప్పారు. దీంతో ఆమె ఆ మొత్తాన్ని చెల్లించింది.
అయితే ఆ సంస్థ యజమానుల్లో ఒకడు అయిన శీర్షత్ ఆమెకు లోన్ ఇవ్వాలంటే మరో రూ.30వేలు కమిషన్ ఇవ్వాలని అన్నాడు. ఇక సావంత్ అయితే ఆమెకు రూ.5 లక్షల లోన్ ఇవ్వాలంటే తన కోర్కె తీర్చాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో ఆమె చించ్‌వాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని ఆ ఇద్దరు వ్యక్తులతోపాటు ఆ సంస్థకు యజమానురాలిగా ఉన్న మరో మహిళను అరెస్టు చేశారు.