పబ్‌జి మొబైల్ గేమ్‌కు ఇప్పుడు పిల్లలు, యువత ఎలా బానిసలయ్యారో అందరికీ తెలిసిందే. ఈ గేమ్‌ను ఆడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరైతే ఈ గేమ్‌ను ఆడేందుకు ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. కొత్తగా ఫోన్‌ను కొనుగోలు చేసి మరీ పబ్‌జి మొబైల్ గేమ్‌ను ఆడుతున్నారంటే.. ఈ గేమ్‌కు అందరూ ఎలా వ్యసనపరులుగా మారారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు తన తల్లిదండ్రులు తనకు పబ్‌జి మొబైల్ గేమ్ ఆడేందుకు ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ అసలు జరిగిన విషయం ఏమిటంటే…
ముంబైకి చెందిన ఓ యువకుడు (18) డిగ్రీ చదువుతున్నాడు. పబ్‌జి మొబైల్ గేమ్‌కు అతను బానిసయ్యాడు. తన స్నేహితులు ఫోన్లలో గేమ్ ఆడుతుంటే చూసి తాను కూడా ఓ ఫోన్ ఎలాగైనా కొనుగోలు చేసి అందులో పబ్‌జి మొబైల్ ఆడాలనుకున్నాడు. దీంతో ఇదే విషయాన్ని అతను ఇంట్లో చెప్పి తనకు రూ.37,000 పెట్టి పబ్‌జి మొబైల్ ఆడేందుకు ఓ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనివ్వమని ఇంట్లో తల్లిదండ్రులను అడిగాడు. అయితే వారు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆ యువకుడు తీవ్ర మనస్థాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇటీవలి కాలంలో ఇలా పబ్‌జి బారిన పడి విద్యార్థులు చదువులను నిర్లక్ష్యం చేస్తున్నారనే వార్తలు బాగా వస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ 11 ఏళ్ల బాలుడు పబ్‌జిని బ్యాన్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాడు. జమ్మూ కాశ్మీర్‌లో అయితే పబ్‌జి మొబైల్ గేమ్‌ను బ్యాన్ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక గుజరాత్‌లో ఇప్పటి్కే ఈ గేమ్‌ను ప్రాథమిక పాఠశాలల్లో ఆడడం బ్యాన్ చేశారు. ఆ తరువాత ఇప్పుడు తాజాగా ఈ ముంబై ఘటన చోటు చేసుకుంది. మరి ఈ విషయంపై ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో.. వేచి చూస్తే తెలుస్తుంది..!