మహిళల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు

-

తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధిస్తున్నాడని ఆర్టిజన్ సంస్థ డైరెక్టర్ షెజల్ ఆరోపణలు చేశారు. ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. దీంతో ఢిల్లీలో ఏకంగా బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి వాహనానికి అడ్డు నిల్చొని నిరసన తెలిపారు. తనను చంపుతామని దుర్గం చిన్నయ్య బెదిరిస్తున్నాడని ఆమె వాపోయారు. చిన్నయ్యతో తనకు ప్రాణ హాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య పై ఆ నియోజకవర్గంలోని జానకిపురం గ్రామ సర్పంచి నవ్య లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేశారు. గతంలో ఒకసారి ఆయన వేధిస్తున్నాడని బహిరంగంగానే ఆమె వెల్లడించారు. ప్రస్తుతం గ్రామ అభివృద్దికి నిధులు కావాలంటే తాము చెప్పిన చోట బాండ్ పేపర్ పై  సంతకం చేయాలని వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన భర్తతో కూడా ఒత్తిడి చేయిస్తున్నారని అన్నారు. అవసరమైతే భర్తకు విడాకులిస్తాను కానీ ఎవరికీ లొంగను అని మీడియా సాక్షిగా ప్రకటించారు.

ఎమ్మెల్యేలు సొంత పార్టీ మహిళ లీడర్లనే టార్గెట్ చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తుండటంతో  మంత్రి కేటీఆర్ దగ్గర వాపోతున్నట్లు సమాచారం. దీనికి తోడు భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్ మెంట్లు, తదితర విమర్శలు ఎమ్మెల్యేలపై రావడంతో  బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో  ఈ వివాదాలు పార్టీకి ఇబ్బందిగా మారినట్లు అధిష్టానం భావిస్తోంది. మరో వైపు హైదరాబాద్ కు చెందిన ఓ ఎమ్మెల్యే కార్పొరేటర్ కు అర్దరాత్రి ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ కు ఆమె కంప్లైంట్ చేసినట్లు సమాాచారం. గతంలో మహబూబాబాద్ లో  పనిచేసిన జిల్లా కలెక్టర్ తో  ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్యంగా ప్రవర్తించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆ పార్టీకి డ్యామేజ్ చేస్తోంది. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పార్టీపై పడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news