దేశంలో మళ్లీ పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇది వరకు దీపావళి ముందు కేంద్రం దేశప్రజలకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెట్రోల్ పై రూ.5, డిజిల్ పై రూ10 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డిజిల్ రేట్లపై వ్యాట్ ను తగ్గించాయి. ఇదే దారిలో పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ధరల తగ్గింపు అంశంపై నిర్ణయం తీసుకున్నాయి. కాగా.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించినా కూడా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్, డిజిల్ ధరలు వందకు పైగానే ఉంటున్నాయి.
తాజాగా దేశంలో మరింతగా పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చేందుకు వ్యూహాత్మక, అత్యవసర నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోని మూడు భూగర్భ క్షేత్రాల్లో 3.8 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఇందులో నుంచి ముడి చమురును మార్కెట్ లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. మార్కెట్ లో ఇంధన ఫ్లోను పెంచడం ద్వాారా ధరలను అదుపులోకి తేవచ్చని కేంద్రం భావిస్తోంది.