డబుల్ఇంజిన్.. సింగిల్ ఇంజిన్.. తేడా లేదు.. అంతటా ఊచ‘కోత’లే…

-

అసలే ఎండాకాలం. సుర్రుమంటున్న వేడి. నడవాలంటే భయం. ఎండలో పోవాలంటే వణుకు. భానుడు ఏ రేంజిలో విరుచుకుపడుతున్నామో మనం చూస్తున్నాం. ఓవైపు ఉక్కబోత.. మరోవైపు వేడిమి. మండే ఎండల తీవ్రత నుంచి తప్పించుకునేందుకు చాలా మంది బయటకు వెళ్లేందుకూ జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప వెళ్లడం లేదు. ఇండ్లల్లో ఉండే వారు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పెట్టుకుని ‘ప్రాణ’లను చల్లబర్చుకుంటున్నారు.

ఈ సమయంలో కరెంటు పోతే ఇంకేమైనా ఉందా? కానీ.. ‘నాతో పెట్టుకుంటే ఇట్లుంటది’ అన్న రీతిలో దేశవ్యాప్తంగా కరెంటు కోతలు తీవ్రతరమయ్యాయి. ‘డబుల్ ఇంజిన్’, ‘సింగిల్ ఇంజిన్’ అన్న తేడాలేకుండా ఊచకోతలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈ కోతలు తప్పడం లేదు. చివరకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వరాష్ర్టంలోనూ తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. అక్కడ పరిశ్రమలకు ఒకరోజు పవర్ హాలిడే ప్రకటించారు. సాగుకు మూడునాలుగు గంటల కంటే మించి ఇవ్వడం లేదు. ఇక రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, బిహార్, జార్ఖండ్, రాజస్థాన్, హర్యాణ, తమిళనాడులో కోతలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ సంగతి చెప్పనక్కర్లేదు. తెలంగాణలోనూ కోతలు షరూ అయ్యాయి. పరిశ్రమలకు నెలవైన మహారాష్ర్ట, తమిళనాడు, గుజరాత్ లలో అయితే ఏకంగా పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించారు. కంపెనీలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అధిక ధరకు విద్యుత్ ను కొని సరఫరా కూడా చేస్తున్నాయి. నిజానికి ప్రతి ఎండాకాలంలో విద్యుత్ కొరతలు సహజమే. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే మధ్య ఈ అనధికారిక కోతలు ఉంటాయి. ఈ సమయంలో సాధారణంగా ప్రతి ఏటా డిమాండ్ సప్లయ్ మధ్య 0.5 శాతం తేడా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఈ తేడా దేశవ్యాప్తంగా సగటున 1.5 శాతానికి పెరిగిందని కేంద్ర ప్రభుత్వం అధికారిక నివేదికలో వెల్లడించింది.

దీనికి ముఖ్యకారణం బొగ్గు కొరత అని కూడా వివరించింది. అయితే.. ఈ డిమాండ్ సప్లయ్‌లో లోటు ఒక్కో రాష్ర్టంలో ఒక్కో విధంగా ఉండటంతో కరెంటు కోతలు ఎక్కువ తక్కువగా ఉంటున్నాయి. మహారాష్ర్టలో డిమాండ్ సప్లయ్ మధ్య తేడా 1.4 శాతం ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో అది 8.5 శాతంగా ఉంది. ఇక జార్ఖండ్, బిహార్, హర్యానా, ఉత్తరాఖండ్ లో ఇది 3 శాతంగా ఉంది. దాంతో అన్ని రాష్ర్టాల్లోనూ అధికారికంగానో లేదా అనధికారికంగానో కరెంటు కోతలు అమలవుతున్నాయి. మొత్తంగా 14 రాష్ర్టాలలో లోడ్ షెడ్డింగ్ కొనసాగుతోంది. అయితే ఎప్పుడు కరెంటు పోతుందో.. ఎప్పుడో వస్తుందో.. ఎన్నిగంటలు పోతుందో.. ఎన్ని గంటలు వస్తుందో.. తెలియని కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అందుకే డబుల్ ఇంజిన్ అయినా, సింగిల్ ఇంజిన్ ప్రభుత్వాలయినా ‘పవర్’ ముందు తగ్గాల్సిందే అన్నట్లుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news