ఏ పార్టీకి అయినా కార్యకర్తలే కీలకం కానీ వారంతా భజనకే పరిమితం అయితే ప్రమాదం. అత్యంత ప్రమాదం ఇదే ఇవాళ వద్దని హితవు చెబుతున్నారు శ్రేయోభిలాషులు. ఆ వివరం ఈ కథనంలో..!
కేవలం జై తెలుగుదేశం లేదా జై చంద్రబాబు, జై లోకేశ్ అనే పోస్టులు వలన ఎటువంటి ఉపయోగం లేదు. మీ ప్రాంతాలలో జరిగే పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం తీరు వలన కలుగుతున్న అసౌకర్యాలు, నష్టాలు వీటిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెస్తూ సంబంధిత వివరాలు సహేతుక రీతిలో రాస్తూ పోస్ట్ చేయండి. పార్టీకి కావలసినది ఓట్లు..ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే! అని అంటున్నారు విజయనగరం జిల్లాకు చెందిన తెలుగు యువత అధ్యక్షులు వేమలి చైతన్య బాబు.
నాలుగు దశాబ్దాల తెలుగుదేశం ప్రయాణంలో చంద్రబాబు కానీ లోకేశ్ కానీ ఇంకా ముందున్న కాలంలో మరో నేత ఎవ్వరు కానీ సాధించాల్సింది ఎంతో! అందుకు తగ్గ పరిణితిని పార్టీలో ఇవాళ క్రియాశీలకం అని అనుకుంటున్న నాయకులు మరియు కార్యకర్తలు సాధించాల్సిన సమయం కూడా రానే వచ్చింది. చంద్రబాబు ఇవాళ నిజంగానే మారిపోయారు అనేందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
నిన్నటి వేళ హైద్రాబాద్ ఎన్టీఆర్ భవన్లో కూడా ఒకే ఒక్క మాట ఆయన చెప్పారు ప్రజా పోరాటాల ద్వారానే నాయకులు కాగలరు అని.. దిగువ స్థాయి నేతలు లేదా కార్యకర్తలు లేదా సంబంధిత శ్రేణులు ఇవేవీ గుర్తించకుండా డొక్కూ డోలూ మాటలతో కాలం గడిపితే ప్రతిపక్ష హోదా ను కూడా ముందున్న కాలంలో కోల్పోయే ప్రమాదాలే ఎక్కువ అన్నది పార్టీని ఉద్దేశించి శ్రేయోభిలాషులు, అన్న ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్న హితవు.
ఇప్పటికే తెలుగు యువత విజయనగరం కానీ తెలుగు యువత శ్రీకాకుళం విభాగం కానీ ప్రజాపోరాటాలను ఉద్ధృతం చేస్తూ వస్తున్నాయి. ఇదే వేగంతో మిగిలిన ప్రాంతాల నయా నాయకులు కూడా పనిచేయాలి. ముఖ్యంగా పార్టీకి జవం మరియు జీవం నింపే క్రమంలో ప్రజా పోరాటాలే పెద్ద దిక్కు అవుతాయన్న సత్యాన్ని లేదా వాస్తవాన్ని గుర్తించి అందుకు తగ్గ కార్యాచరణను అమలు చేయాలి. ఇవేవీ కాకుండా చంద్రబాబునో లేదా లోకేశ్ నో కీర్తిస్తే పనులు జరగవు. ఆ విధంగా వేడుకలు చేసినా కూడా జనం హర్షించరు. ఎందుకంటే ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ గడ్డు కాలంలోనే ఉంది.
ఇందుకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. త్వరలో లోకేశ్ పాదయాత్రకు సన్నద్ధం అయితే అదేవిధంగా మిగిలిన నాయకులు కూడా ఆయనతో పాటు క్షేత్ర స్థాయిలో సమన్వయ బాధ్యతలు అందుకుని, ప్రజా క్షేత్రాన సమస్యలను సహేతుక రీతిలో వెలుగులోకి తెస్తేనే సంబంధిత కార్యాచరణ విజయవంతం అవ్వడం ఖాయం. ఆ తరహా బాధ్యతను సీనియర్లు అందుకోవాలి. జూనియర్లు వారి కోవలో తోవలో నడిచి పార్టీకి పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.