సైబర్ కేటుగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అమాయకులకు ఎరవేసి వారి కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు చేస్తూ వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఈ వేధింపులు తట్టుకోలేక కొందరు పోలీసులను ఆశ్రయిస్తే మరికొందరు పరువు పోతుందని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తి ఆన్లైన్ వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాడు. అసలేం జరిగిందంటే..?
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన ముంజాలు మధుక్రిష్ణకు జూన్ 16న ఓ లింకు ద్వారా అకౌంట్కు 8 వేల రూపాయలు వచ్చాయి. తర్వాత ఐదు రోజులకు ఆ డబ్బులు తిరిగి పంపించాలని, లేకపోతే న్యూడ్ ఫొటోలు క్రియేట్ చేసి కాంటాక్ట్ లిస్టులో పెడతామని బెదిరింపులు వచ్చాయి. భయంతో వారు చెప్పినట్లుగానే దశల వారిగా 4 లక్షల రూపాయలను ఆన్లైన్లో చెల్లించాడు. అయినా వేధింపులు ఆగకపపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.