మహారాష్ట్ర, గుజరాత్ వాసులను తీవ్రంగా భయపెడుతున్న నిసర్గ తుఫాన్ తీరం దాటింది. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ముంబై సమీపంలోని అలీబాగ్ ప్రాంతంలో తుఫాన్ తీరం దాటింది. దీంతో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అక్కడ కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తున్నాయి. దీంతోపాటు ముంబై సముద్ర తీరంలోనూ వాతావరణం భయానకంగా మారింది. అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
కాగా మరో 3 గంటల్లోగా తుఫాన్ పూర్తిగా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో తీరం దాటిన అనంతరం ఆ పరిసర ప్రాంతాల్లో 6 గంటలకు పైగా నిరంతరాయంగా భారీ వర్షాలు పడుతాయని అంటున్నారు. అయితే ఇప్పటికే ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లలో మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే తుఫాన్ ప్రభావం వల్ల కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి.
ఇక ముంబైలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ 30 వరకు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. తుఫాన్ ప్రభావం గుజరాత్‌పై కూడా తీవ్రంగానే ఉండడంతో అక్కడ కూడా సహాయ చర్యలు చేపడుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.