- కర్మాగారం అభివృద్ధి పనులు 99.85 శాతం పూర్తి
- ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైతే 12.7 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి సమస్య దూరం
- కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడ
న్యూఢిల్లీః తెలంగాణలోని రామగుండంలో ఉన్న ఎరువుల ఉత్పత్తి కార్మాగారం ఆర్ ఎఫ్ సీ ఎల్ పై కేంద్రం దృష్టి సారించిందనీ, దాని అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. తాజాగా దేశంలోని పలు ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ, పనితీరుపై దేశ రాజధాని ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా రామగుండం ప్లాంట్ అధికారులు, ఆ శాఖ సెక్రెటరీ, ఆర్ఎఫ్సీఎల్ సీఈఓ తదితర ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించి.. ఎరువుల కర్మాగారాల ఆర్థిక ప్రగతి, ఇతర అభివృద్ధి అంశాలపై ఆయన చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామగుండం ఎరువుల కర్మాగారం అభివృద్ధికి సంబంధించిన పనులు 99.85 శాతం పూర్తయ్యాయని తెలిపారు. అక్కడ యూరియా ఉత్పత్తి ప్రారంభం అయితే దేశంలో రైతులకు యూరియా ఇక్కట్లు పూర్తిగా తొలగిపోతాయని వెల్లడించారు. అలాగే, ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరిగితే దాదాపు 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన భారం భారతకు లేకుండా పోతుందని తెలిపారు. దీనికి అనుగుణంగా ఈ పరిశ్రమ అభివృద్ధి పనులను వేగవంతం చేసినట్టు వెల్లడించారు.
కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి ఈ పరిశ్రమలో ఎరువులు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమవుతుందనీ, దానికి అనుగుణంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. కాగా, గోరఖ్ పూర్ ఎరువుల ఫ్యాక్టరీ పనులు 77 శాతం, సింధ్రీ ప్లాంట్ పనులు 70 శాతం, బరౌనీ కర్మాగారం పనులు 69 శాతం పూర్తయినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.