ప్రపంచం ఎంత వేగంగా ముందుకెళ్తోన్నా కొన్నిప్రాంతాలు మాత్రం మూఢనమ్మకాలు, అంటరానితనంతో ఇంకా వెనకబడే ఉన్నాయి. ఇప్పటికీ దళితులను గుడిలోకి రానివ్వని కొన్ని ప్రాంతాలున్నాయి. అలాంటి వాటిలో ఒకటే.. కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ఓ గ్రామం. ఇటీవల జరిగిన గ్రామ దేవత ఉత్సవంలో ఓ దళిత బాలుడు అమ్మవారి విగ్రహాన్ని తాకాడని అతటి కుటుంబానికి గ్రామ పెద్ద రూ.60 వేలు జరిమానా విధించారు.
రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబం అంత మొత్తం చెల్లించుకోలేక గ్రామ పెద్దలను బతిమాలింది. అయినా కనికరించని వారు.. జరిమానా చెల్లించకపోతే గ్రామాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత దళిత సంఘాల నాయకులు.. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి సెప్టెంబరు 20న స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..దళిత కుటుంబానికి జరిమానా విధించిన మొత్తం ఎనిమిది మందిని గ్రామపెద్దలను అరెస్టు చేశారు. అనంతరం భూతమ్మ గుడి తాళం పగలగొట్టి చేతన్ కుటుంబాన్ని ఆలయంలోకి తీసుకెళ్లి ప్రార్థనలు చేయించారు.