నిన్నటివేళ దామోదరం సంజీవయ్య జయంతి . ఆయన ఉమ్మడి ఆంధ్రాకు రెండో ముఖ్యమంత్రి. మొదటి దళిత ముఖ్యమంత్రి. ఆయన పేరునే కర్నూలు జిల్లాకు పెట్టాలన్న వాదన ఒకటి వినిపిస్తోంది. జనసేన కూడా ఆయన పేరిట స్మారక నిర్మాణం ఏదయినా చేపట్టాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తోంది.
ఇందుకు ఓ కోటి రూపాయలు కేటాయించింది కూడా..! దామోదరం సంజీవయ్య స్వగ్రామం కర్నూలు జిల్లా పెద్దపాడులో ఈ స్మారక నిర్మాణం చేపట్టేందుకు జనసేన నిర్ణయించింది కూడా! ఈ స్థాయిలో మిగతా పార్టీలేవీ ఆయనను స్మరించుకున్న దాఖలాలేవీ లేవు.
1960 లోనే రాష్ట్రానికి ఎంతో చేశారని, రాయలసీమలో గాజులదీన్నే, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో పులిచింతల, శ్రీకాకుళంలో వంశధార లాంటి నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి శ్రీకారం దిద్దిన మహనీయుడు ఆయన అని ఆ రోజు సంజీవయ్య గ్రామాన్ని సందర్శించిన వేళ మాజీ స్పీకర్,జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు.
ఇంతవరకూ బాగుంది కానీ ఆయన స్మరణార్థం అధికార పార్టీ ఏం చేస్తుందన్నది ఇప్పటికీ తేలడం లేదు. నిన్నటి వేళ ఆయన జయంతి జిల్లా కేంద్రాలలో ఎక్కడా ఆ హడావుడే లేదు.అధికారిక కార్యక్రమం నిర్వహించిన దాఖలాలు అస్సలు లేవు.ఒక్క వైసీపీ అనేకాదు టీడీపీ కూడా నిన్నటి వేళ ఆయన స్మరణనే మరిచిపోయింది. ఎన్నికల వేళ మాత్రం హాయిగా ఆయన పేరు వాడుకునే పార్టీలకు కనీస బాధ్యత లేకపోవడమే శోచనీయం.