చాలా మంది చుండ్రు (Dandruff) సమస్యతో సతమతమవుతూ ఉంటారు. దీని కోసం మార్కెట్లో దొరికే వివిధ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. మీరు కూడా చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే తప్పకుండా ఈ చిన్న చిన్న చిట్కాలను అనుసరించండి. వీటిని అనుసరించడం వల్ల తప్పకుండా చుండ్రు దూరమైపోతుంది.
వేప:
ఆరోగ్యానికి వేప ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయుర్వేద గుణాలు ఉండే వేప ఉపయోగించడం వల్ల చుండ్రు పూర్తిగా మాయమైపోతుంది. వేపలో యాంటిసెప్టిక్ గుణాలు ఉంటాయి. అయితే ఇది తలకి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూస్తే…
చుండ్రు సమస్యతో బాధపడే వాళ్లు కొద్దిగా వేపాకులు తీసుకుని నీళ్ళలో వేసి మరిగించండి. ఆ తర్వాత ఆ ఆకులను తీసి మెత్తని పేస్టులాగ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని జుట్టుకు అప్లై చేసి కాసేపు ఉంచి ఆ తర్వాత శుభ్రంగా కడిగేసుకోండి.
పెరుగు:
చుండ్రును తరిమి కొట్టడానికి పెరుగు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం మీరు పుల్లటి పెరుగు ఉపయోగించండి. ఆ పెరుగును తలకు అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
పెరుగులో లాక్టోస్ మరియు ప్రోటీన్స్ ఉంటాయి. అయితే పెరుగును తలకు పట్టించడం వల్ల జుట్టు షైనీగా మాత్రమే కాకుండా చుండ్రు సమస్యలు కూడా లేకుండా చేస్తుంది.
బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని తలకు అప్లై చేసి ఒక నిమిషం ఉంచి ఆ తర్వాత కడిగేసుకోండి. ఇలా కూడా చుండ్రుని తగ్గించచ్చు.
కుంకుడు రసం:
కుంకుడు రసంతో తలని వాష్ చేయడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా దూరమైపోతుంది. కనుక ఈ పద్దతిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు.
కర్పూరం కొబ్బరి నూనె:
మీరు కొద్దిగా కర్పూరం తీసుకుని దానిలో కొబ్బరి నూనె వేసి.. ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే చుండ్రు మాయం అయిపోతుంది. ఇలా ఈ సులువైన చిట్కాలతో చుండ్రుకు చెక్ పెట్టేయచ్చు.