బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియాతో తలపడుతున్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా దూరమైన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఇప్పుడు సిరీస్ నుంచి మొత్తంగా ఔట్ అయ్యాడు. మోచేతికి అయిన ఫ్రాక్చర్ నుంచి కోలుకోకపోవడమే అందుకు కారణమని.. వార్నర్ చికిత్స కోసం ఆస్ట్రేలియా తిరిగొస్తాడని.. మళ్లీ వన్డే సిరీస్‌కు అందబాటులో ఉండొచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
రెండో టెస్ట్ మ్యాచ్‌లోని మొదటి రోజు ఆటలో టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ వేసిన ఓ బౌన్సర్ వార్నర్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని మోచేతికి బలంగా తాకింది. దాంతో విలవిల్లాడిన వార్నర్.. ఫిజియోలతో ట్రీట్‌మెంట్ తీసుకొని బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత మరో రెండు, మూడు బౌన్సర్లు అతని హెల్మెట్‌కు బలంగా తాకడంతో ఫిజియోలు వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించారు. గాయాలతో బ్యాటింగ్ కొనసాగించిన వార్నర్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు.
‘వార్నర్ గాయంపై మెడికల్ స్టాఫ్ శనివారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అతడి తలకు, భుజానికి బలమైన గాయాలయ్యాయి. అస్వస్థతకు లోనయ్యాడు. దాంతోనే మైదానంలోకి రాలేదు. అతడి ఏమైందనేది మెడికల్ టీమ్ పరీక్షిస్తోంది’ అని ఖవాజా తెలిపాడు.