దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న మొదటి టెస్టు రెండో రోజు ఆట వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. కఠినమైన పరిస్థితుల్లో మొదటి రోజు ఆటలో ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రాహుల్‌కు అజింక్యా రహానే(40) చక్కటి భాగస్వామ్యం అందించాడు. భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయకపోతే దక్షిణాఫ్రికాకు కష్టకాలం తప్పుదు.
మొదటి రోజు ఆటలో పూర్తిగా భారత్ ఆధిపత్యం కనిపించింది. ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 272 పరుగుల చేసింది. ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్(60) మొదటి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యంతో బలమైన పునాది వేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ(35) కేఎల్ రాహుల్‌కు చక్కని సహకారం అందించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్(122), రహానే(40) నాటౌట్‌గా నిలిచారు. దక్షిణాఫ్రికా గడ్డపైన టెస్టు క్రికెట్‌లో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సెంచరీని నమోదు చేయగా, ఆ తర్వాత శతకం సాధించింది కేఎల్ రాహుల్ కావడం గమనార్హం.