నెలసరి అంటే ప్రతి మహిళ జీవితంలో సహజంగా జరిగే ఒక సాధారణ ప్రక్రియ. కానీ అది క్రమం తప్పి రావడం మొదలైతే ఆందోళన కూడా సహజంగానే వస్తుంది. పెళ్లి కాలేదే, మరి ఎందుకు ఇలా జరుగుతోంది? అని కొందరు ఆలోచిస్తారు. హార్మోన్ల సమస్య ఏమైనా ఉందా? అని మరికొందరు భయపడతారు. నిజానికి చాలా సందర్భాల్లో పీరియడ్స్ ఆలస్యం కావడానికి పెద్ద వ్యాధులు కాకుండా మన రోజువారీ అలవాట్లే కారణం అవుతుంటాయి. చాలా మంది పీరియడ్స్ ఆలస్యమైతే వెంటనే హార్మోన్ టాబ్లెట్లు వాడుతుంటారు. కానీ అసలు లోపం ఎక్కడుందో తెలుసుకోవడం ముఖ్యం.
అధిక ఒత్తిడి (Stress) – ప్రధాన శత్రువు: మీరు విన్నది నిజమే! మన మెదడులోని ‘హైపోథాలమస్’ అనే భాగం పీరియడ్స్‌ను నియంత్రిస్తుంది. మీరు అతిగా ఒత్తిడికి లోనైనప్పుడు, శరీరం ‘కార్టిసోల్’ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది మీ నెలసరిని నియంత్రించే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలను దెబ్బతీస్తుంది. కాబట్టి అతిగా ఆలోచించడం ఆందోళన చెందడం వెంటనే మానేయండి.

సరైన నిద్ర లేకపోవడం: రాత్రుళ్లు పొద్దుపోయే వరకు ఫోన్లు చూడటం, తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల శరీరంలోని ‘బయోలాజికల్ క్లాక్’ తలకిందులవుతుంది. దీనివల్ల పీరియడ్స్ వచ్చే సమయం మారుతుంది. రోజుకు కనీసం 7-8 గంటల గాఢ నిద్ర చాలా అవసరం.
ఆహారపు అలవాట్లు: జంక్ ఫుడ్, అతిగా తీపి పదార్థాలు తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగి, అది పీరియడ్స్ ఆలస్యమవడానికి కారణమవుతుంది. ముఖ్యంగా రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేయడం మానేయండి.
కఠినమైన వ్యాయామాలు: ఒక్కసారిగా బరువు తగ్గాలని లేదా బాడీ షేప్ కోసం శరీరానికి మించిన వ్యాయామాలు చేయడం వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. వ్యాయామం అవసరమే, కానీ అది మితంగా ఉండాలి.
పరిష్కారం ఏమిటి?: రోజూ ఉదయాన్నే 15 నిమిషాల పాటు ధ్యానం (Meditation) చేయండి. తాజా పండ్లు, ఆకుకూరలు మీ భోజనంలో ఉండేలా చూసుకోండి. నువ్వులు, బెల్లం వంటి సాంప్రదాయ ఆహారాలను తీసుకోవడం వల్ల నెలసరి క్రమబద్ధం అవుతుంది.
గమనిక: పీరియడ్స్ ఒకటి లేదా రెండు సార్లు ఆలస్యమైతే జీవనశైలి మార్పులతో సర్దుకుంటుంది. కానీ, వరుసగా మూడు నెలల కంటే ఎక్కువ కాలం క్రమం తప్పినా, లేదా విపరీతమైన కడుపునొప్పి వచ్చినా వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం తప్పనిసరి.
