హైదరాబాద్: ఏపీ, తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులపై కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్ పడింది. కరోనా రిపోర్టులు లేకుంటే 14 రోజులు, నెగిటివ్ రిపోర్టు ఉంటే వారం పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విపత్తు నిర్వహణ చట్టం కింద ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్‌తో పాటు ఎన్440కే కొత్త స్ట్రెయిన్ ప్రభావం తీవ్రంగా ఉందన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్440కే కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తోందన్న కథనాలను సీసీఎంబీ కొట్టిపారేసిన కొద్దిసేపటికే కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
రెండు సార్లు వ్యాక్సిన్లు తీసుకున్న వారు కూడా ఢిల్లీ వెళ్లే 72 గంటలకు ముందు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని కేజ్రీవాల్ సూచించారు. నెగెటివ్ సర్టిఫికెట్‌తో వచ్చే వాళ్లు ఏడు రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇక.. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ మీదుగా వేరే రాష్ట్రాలకు రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చని, ఢిల్లీకి మాత్రం రావోద్దని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉండేవారు, ప్రభుత్వ విధులు నిర్వర్తించేవారు, వారి సిబ్బందికి ఎలాంటి లక్షణాలూ లేకపోతే ఈ నిబంధనలు వర్తించవని కేజ్రీవాల్ తెలిపారు.