దిల్లీలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ గుండెను 19 ఏళ్ల యువకుడికి అమర్చారు. ఎనిమిది గంటలకుపైగా శ్రమించిన వైద్యులు విజయవంతంగా ఈ సర్జరీ పూర్తి చేశారు. ఉదయపు నడకకు వెళ్లిన మహిళ (55) స్పృహ కోల్పోయి కింద పడటంతో తలకు బలమైన గాయమైంది. ఆమెను ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా వైద్యులు మంగళవారం బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు.
ఆమె హృదయాన్ని స్థానిక ఓఖ్లా ప్రాంతంలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌ఈహెచ్‌ఐ)లో గుండె సంబంధిత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అమర్చాలని నిర్ణయించారు. దీంతో గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటుచేసి.. 9.2 కిలోమీటర్ల దూరంలోని ఎఫ్‌ఈహెచ్‌ఐకి కేవలం 14 నిమిషాల్లో గుండెను చేరవేశారు.
మహిళ, యువకుడి మధ్య వయసు తేడా ఎక్కువ. వారి ఎత్తులోనూ అంతరం అధికంగా ఉంది. దీంతో పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉన్నప్పటికీ.. సాంకేతికంగా కొన్ని మార్పులు చేయడం ద్వారా వైద్యులు అవయవ మార్పిడి శస్త్రచికిత్సను పూర్తిచేశారు.