ఏపీలో డ్రైఫ్రూట్స్.. మటన్ కైమాకు భారిగా పెరిగిన డిమాండ్.. అందుకోసమే..!

-

కొన్నిరోజుల నుంచి ఆంధ్రాలో డ్రై ఫ్రూట్స్ కు, మటన్ కైమాకు డిమాండ్ అమాంతం పెరిగింది. జనాలు ఎక్కువగా కొనడంతో వ్యాపారులు వాటి రేట్లను కూడా పెంచేశారు. అసలు కొన్ని షాపుల్లో అయితే.. మటన్ త్వరగా అయిపోతుంది. ఏంటి ఏపీ వాళ్లు అంతలా తింటున్నారా అనుకుంటున్నారా..కానేకాదు..మరి ఎందుకుకొంటున్నారో తెలుసా.?

సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. అసలు సంక్రాంతి అంటే..పిండివంటలు, కోడిపందాలు, ముత్యాల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు. ఈ హడావిడి మొత్తం ఏపీలోని గోదావరి జిల్లాల్లో ఓ రేంజ్ లో ఉంటుంది. అసలు సంక్రాంతి అక్కడే మనకు బాగా కనిపిస్తుంది. మిగత ఏరియాల్లో పండగ చేసుకున్నప్పటికీ.. ఈ జిల్లాల్లో ఉన్నంతగా తెలుగురాష్ట్రాల్లో మరెక్కడా ఉండదనేది జగమెరిగిన సత్యం. ఎన్ని ఆంక్షలు ఉన్నా.. ఎన్ని కేసులు పెడుతున్నారా సరే తగ్గేదేలా అంటూ పందెంరాయుళ్లు దూసుకెళ్తున్నారు.

కోడి పుంజుకు బలం కోసం బాదం, పిస్తా, డ్రైఫూట్‌ లడ్డూ, మటన్‌ కైమా, కోడిగుడ్లు పెడతారు..ఆహారంగా సోళ్లు, గంట్లు, మెరికలు అందిస్తారు. పుంజును తరచూ పశువైద్యుడికి చూపించి వారి సలహా మేరకు విటమిన్‌ మాత్రలు కూడా అందిస్తారు. అంటే ఈ 5 నెలలు కోడిపుంజు రాజభోగాలు అనుభవిస్తుందన్నమాట. పుంజు సామర్థ్యం తెలుసుకునేందుకు తరచూ ట్రయల్‌ పందేలు వేస్తారు. ఇలా గత ఐదు నెలలుగా పందెం కోళ్ల కోసం.. వాటి యజమానాలు భారీగా డ్రై ఫ్రూట్స్ తో పాటు.. మటన్ కైమాను కొనుగోలు చేసి తమ కోళ్లకు ఆహారంగా పెడుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోనూ ఈ కోళ్ల పెంపకం భారీగా జరుగుతోంది. దీంతో వాటికోసం ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేస్తున్నారు. అందుకే డిమాండ్ అమాంతం పెరిగింది.

ఏడాదికి మొత్తంగా ఇంత ఖర్చుపెడతారా..!

వాటి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు పందెంరాయుళ్లు. పుంజులపై భారీగా పెట్టుబడులు పెట్టి సంక్రాంతి పండుగకు రాబట్టుకోవాలని కొందరు, ప్రతిష్ట కోసం మరికొందరు శ్రమిస్తున్నారు. ఇందులో లాభం పొందేవారికంటే.. నష్టాలను చివిచూసేవాళ్లే ఎక్కువ. పాపం అప్పులు చేసిమరి కోళ్లను పెంచి.. అవి పందెంలో ఆశినంత ఇవ్వకపోతే..వాళ్లుబాధ ఆ ఇంటి గృహిణికి మాత్రమే తెలుస్తుంది.

నెలకు ఒక్కొక్క పుంజుపై 10 వేల నుంచి 30వేలు ఖర్చు చేస్తారంటే..ఆశ్యర్యంగా లేదూ..ముందుగా పుంజుల పెంపకం కోసం స్థలం లీజుకు తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో శిబిరంలో 20 నుంచి 200 వరకు పుంజులను పెంచుతారు. వారి స్థాయిని బట్టి పుంజుల పెంపకం కోసం ఏడాదికి 6 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు.

పందెంకోళ్లకు మిలటరీ స్థాయిలో శిక్షణ..

ఈ పుంజులకు మిలటరీ లెవల్లో శిక్షణ ఇస్తారట. ఉదయాన్నే 5గంటలకు కోడి పుంజులను బయటకు తీసి కాసేపు చల్లగాలి శ్వాస తీసుకునేలా చూట్టూ వలయంగా ఏర్పాటు చేస్తారు. అందులో కోడి పుంజులను వదిలిపెట్టి పరుగెత్తిస్తారు. ఆ తర్వాత వలయం నుంచి బయటకు తీసి స్విమ్మింగ్‌ చేయిస్తారు. పుంజులు బాగా అలసిపోయిన తర్వాత పాలల్లో నానబెట్టిన పిస్తా, ఖర్జూరం, కిస్‌మిస్‌లు పెట్టి సిరంజి ద్వారా పాలను పట్టిస్తారు. కోడి పుంజులు పందేలలో అన్ని విధాలుగా తట్టుకునే విధంగా పందెం రాయుళ్లు.. శిక్షణ ఇస్తారు.

ముహుర్తం చూసి దించుతారట

కోడి పందేల్లో ప్రావీణ్యం ఉన్నవారు కుక్కుట శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇక పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి కోడి రంగు, జాతిని ఎంపిక చేస్తారు. ఆరోజు ఏ రంగుతో ఉన్న పుంజును పందెంలోకి దించాలో ఆ రంగున్న పుంజును మాత్రమే పందెంలోకి దించుతారని శిక్షకులు చెబుతున్నారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news