ఏపీ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్ బుధవారము ఉదయం బాధ్యతలు స్వీకరించారు.విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం అధికారిక పత్రాలపై ఆయన సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ ,ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు ఫైళ్లపై డిప్యూటీ సీఎంగా తొలి సంతకాలు చేశారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం తన క్యాంపు ఆఫీసులో ఐఏఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక అంశాలపై చర్చించారు. గ్రామాలలో మౌలిక వసతులు, రోడ్లు నిర్మాణం, మంచినీటి ఎద్దడి నివారణ వంటి అంశాలపై ఐఏఎస్ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.ప్రణాళికలు సిద్ధం చేసి పనులు వేగవంతం చేయాలని , మూడు నెలల తర్వాత పనుల పురోగతిపై పునఃసమీక్ష చేస్తానని తెలిపారు. ఈ మూడు నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు డిప్యూటీ సీఎం హితవు పలికారు.