ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ) అభిమానులకు ఇప్పుడు మేం చెప్పబోయేది నిజంగా చేదు వార్తే. ఇప్పటికే ఆ జట్టు కోచ్‌గా డానియెల్ వెటోరీని తప్పించి గ్యారీ కిర్ స్టన్‌కు బాధ్యతలను అప్పగించారు. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌కు గాను ఆర్‌సీబీకి కోచ్‌గా కిర్ స్టన్ వ్యవహరిస్తాడు. ఇక ఈ టీంకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లిని కూడా ఆ బాధ్యతల నుంచి తప్పించనున్నారట. ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రతి ఏటా భారత్‌లో వేసవిలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్ వస్తుందంటే చాలు.. అందరూ ఎంతో ఆసక్తిగా మ్యాచ్‌లను వీక్షించేందుకు ఎదురు చూస్తుంటారు. ఇక ఈ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ఉన్న ప్రత్యేకత గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లి నాయకత్వంలో ఆర్‌బీసీ ముందుకు సాగుతోంది. అయితే కోహ్లి, డివిలియర్స్ లాంటి అత్యుత్తమ ఆటగాళ్లున్నప్పటికీ ఆర్‌సీబీ ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేకపోయింది. అందుకే కనీసం ఈ సారి జరిగే ఐపీఎల్‌లోనైనా ఆర్‌సీబీ ఎలాగైనా ట్రోఫీని సాధించేలా జట్టులో మార్పులు చేస్తున్నారు.
అందులో భాగంగానే కోచ్ వెటోరీని తప్పించి గ్యారీ కిర్‌స్టన్‌కు పగ్గాలు అప్పగించగా, కెప్టెన్‌గా కోహ్లిని తప్పించి ఆ బాధ్యతలను డివిలియర్స్‌కు అప్పగించనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఆర్‌సీబీ జట్టుకు డివిలియర్స్ నాయకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి. డివిలియర్స్ ప్రస్తుతం అంతర్జాతీయ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించి ఖాళీగానే ఉన్నాడు. దీంతోపాటు గతంలో అతనికి సౌతాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ తమ జట్టుకు కెప్టెన్‌గా డివిలియర్స్ అయితే బాగుంటుందని భావిస్తుందట. అందుకనే అతన్ని ఆర్‌సీబీ జట్టుకు కెప్టెన్ ని చేయనున్నారని తెలిసింది. ఇక వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఐపీఎల్ టోర్నమెంట్‌ను కొద్ది రోజుల ముందుగానే నిర్వహించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 29 నుంచి మే 19 తేదీల మధ్య జరగనున్నట్లు తెలిసింది.