ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఏడో రోజున ఎంతో ఘనంగా జరిగాయి.బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. దీంతో భారీగా రద్దీ నెలకొంది. కంపార్ట్మెంట్లు అన్ని ఫుల్లుగా నిండుకున్నాయి. అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇక ఆలయ క్యూ లైన్ల వద్ద భద్రతా సిబ్బంది రద్దీని నియంత్రిస్తున్నారు.
ఇంద్రకీలాద్రి మొత్తం జగన్మాత నామస్మరణతో మారుమ్రోగుతోంది. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో దుర్గమ్శ దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు వేచిచూస్తున్నారు. ఈ క్రమంలోనే టికెట్ దర్శనాలను అధికారులు నిలిపివేశారు. కేవలం తెల్లవారుజామున సర్వదర్శనం టికెట్లను మాత్రం జారీ చేస్తున్నారు. నేడు 2 లక్షలకు పైగా భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేశారు.కాగా, ఓ భక్తురాలితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పోలీసులకు భక్తులకు మధ్య వాగ్వాదం నెలకొంది.