ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల అంశం మీద టీడీపీ అధినేత చంద్రబాబుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖలోని అంశాలకు డీజీపీ సమాధానం ఇచ్చారు. ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించిన వివరాలేమైనా ఉంటే సమర్పించాలని డీజీపీ కోరారు. ప్రధానికి రాసిన లేఖలో తీవ్రమైన ఆరోపణలు చేశారన్న గౌతమ్ సవాంగ్, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగుకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారని అన్నారు.
అలా ఉల్లంఘనలు జరిగినట్టు ఏమైనా ఆధారాలుంటే సమర్పించాలని కోరారు. రాజ్యాంగాన్ని, వ్యక్తిగత గోప్యత హక్కును కాపాడేందుకు సిద్దంగా ఉన్నామన్న ఆయన, పౌరుల హక్కుల పరిరక్షణలో మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు. ఇక ప్రధానికి ఈ అంశం మీద లేఖ రాసిన చంద్రబాబు, వ్యక్తుల ప్రాధమిక హక్కులకి కూడా భంగం కలుగుతోందని అన్నారు. ఇదే లేఖని ఆయన కమ్మ్యూనికేశన్స్ మంత్రికి కూడా పంపారు. అయితే ఇప్పుడు ఆ లేఖలకి డీజీపీ స్పందించడం ఆసక్తికరంగా మారింది.