షుగర్ పేషెంట్స్ ఉపవాసం ఉండొచ్చా..?

-

ఉపవాసం.. ఫాస్టింగ్.. ఒకప్పుడు దేవుడి మొక్కుకుని ఉండేవారు. ఇప్పుడు డైట్ లో భాగంగా ఉంటున్నారు. అయితే ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి మంచిదా.. కొంతవరకు ఉపవాసం మంచిదేనంటున్నారు వైద్యులు. ఫాస్టింగ్ చేయడం వల్ల బరువు తగ్గడమే కాదు.. ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి మధుమేహం బారిన పడే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే హై బీపీ, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయని పరిశోధనలో తేలిందని చెబుతున్నారు. అయితే అప్పుడప్పు చేసే ఉపవాసంతో శరీరంలో మంచిమార్పులే వస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. మరి మధుమేహం ఉన్నవారు ఉపవాసం చేయొచ్చా..?

మధుమేహం ఉన్నవాళ్లు సమయానికి ఆహారం తీసుకోవాలి. లేకపోతే షుగర్ తీవ్రత పెరిగే అవకాశముంది. వారు అంతా సక్రమంగానే తింటున్నా కూడా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ‘ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌’ అంటారు. పిండిపదార్థాల వంటివన్నీ తీసుకుంటున్నా కూడా వీరిలో శరీరం- ఎలాగోలా తంటాలుపడి కొవ్వు పదార్థాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ స్థితిలో వీరు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే ‘ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌’ అనేది బాగా పెరుగుతుంది. ఇక 6 గంటలకంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్థాల మీదే ఆధారపడటం ఆరంభిస్తుంది. ఈ క్రమంలో- వీరి శరీరంలో ఎసిటోన్‌, ఎసిటాల్డిహైడ్‌, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్‌ అనే ఆమ్ల పదార్థాల స్థాయులు చాలా ఎక్కువైపోతాయి. వీటినే ‘కీటోన్‌ బోడీస్‌’ అంటారు.

శరీరంలో వీటి స్థాయులు పెరిగితే గుండె, ఊపిరితిత్తుల పని తీరు దెబ్బతింటూ, క్రమేపీ అవి విఫలమైపోతుంటాయి. అందుకే మధుమేహులకు ఏదైనా సర్జరీ వంటివి చెయ్యాల్సి వచ్చి, గంటలతరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా కూడా ఒకవైపు నుంచి గ్లూకోజు ఎక్కిస్తూ, మరోవైపు ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇస్తారు. ఎప్పుడైనా సరే, మధుమేహులు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ అవసరం. కాబట్టి మధుమేహులు ఉపవాసం చెయ్యకుండా ఉండటం అవసరం.

అయితే మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం మంచే చేస్తోందని, దీనివల్ల వారు త్వరగా మధుమేహం బారినపడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి మధుమేహం లేనివారు, త్వరలో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు.. అప్పుడప్పుడు ఒక క్రమపద్ధతిలో ఉపవాసం చెయ్యటం మంచిదని గుర్తించాలి.

Read more RELATED
Recommended to you

Latest news