మ్యుచువల్‌ ఫండ్స్‌ మీద డిజిటల్‌ లోన్స్‌.. లాభాలు, అర్హత, వడ్డీ రేట్ల వివరాలు..!

-

మ్యుచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో అవి చక్కని లాభాలను ఇస్తాయి. ఇక ఆర్థిక సమస్యలు ఉన్న సమయాల్లో అవే మ్యుచువల్‌ ఫండ్స్‌ మనల్ని ఆదుకుంటాయి. వాటితో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవచ్చు. సాధారణంగా మ్యుచువల్‌ ఫండ్స్‌పై ఇచ్చే లోన్లను సెక్యూర్డ్‌ లోన్లుగా పరిగణిస్తారు. అందువల్ల వీటిని చక్కని ఫైనాన్స్‌ ఆప్షన్‌గా భావించవచ్చు. ఇక సాధారణంగా అన్‌సెక్యూర్డ్‌ విభాగంలో తీసుకునే పర్సనల్‌ లోన్ల కన్నా మ్యుచువల్‌ ఫండ్స్‌ మీద తీసుకునే లోన్లకు వడ్డీ తక్కువ ఉంటుంది.

digital loans on mutual funds eligibility interest rates

పర్సనల్‌ లోన్లకు సహజంగా 11 నుంచి 16 శాతం వడ్డీని వసూలు చేస్తారు. అదే మ్యుచువల్‌ ఫండ్స్‌ మీద తీసుకునే లోన్లకు వడ్డీ 11 నుంచి 13 శాతం వరకు ఉంటుంది. మ్యుచువల్‌ ఫండ్స్‌ మీద తీసుకునే లోన్లు అంటే బ్యాంకులు మనకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం ఇచ్చినట్లే అవుతుంది. ఈ క్రమంలో బ్యాంకులు మ్యుచువల్‌ ఫండ్స్‌కు ఆ ఓవర్‌ డ్రాఫ్ట్‌ అకౌంట్‌ను అటాచ్‌ చేస్తాయి. ఓవర్‌ డ్రాఫ్ట్‌ అకౌంట్‌లో ఉండే లోన్‌ డబ్బులను వాడుకున్న మేరకే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్‌ డ్రాఫ్ట్‌ అకౌంట్‌లో వాడుకున్న మొత్తాన్ని తిరిగి పూర్తిగా చెల్లిస్తే.. దాన్ని క్లోజ్‌ చేయవచ్చు. దీంతో మ్యుచువల్‌ ఫండ్స్‌పై ఖాతాదారులకు మళ్లీ అధికారం వస్తుంది. ఇలా మ్యుచువల్‌ ఫండ్స్‌ మీద లోన్లను తీసుకోవచ్చు.

సాధారణంగా బ్యాంకులు ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌ అయితే వాటిలో 50 శాతం విలువ మేర లోన్లు ఇస్తాయి. అదే ఫిక్స్‌డ్ మెచూరిటీ ప్లాన్లు అయితే వాటిలో 80 శాతం మేర లోన్లు పొందవచ్చు. ఈ రెండూ కాకుండా.. మ్యుచువల్‌ ఫండ్స్‌ మీద లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు భిన్న రకాల లోన్‌ పరిమితులను కూడా కలిగి ఉంటాయి. తాము సొంతంగా విధించుకున్న నిబంధనల మేర బ్యాంకులు లోన్లు ఇస్తాయి.

ఇక దేశంలో అనేక బ్యాంకింగ్‌ యేతర ఫైనాన్స్‌ కంపెనీలు సెక్యూరిటీ ఆధారిత లోన్లు ఇస్తున్నాయి. పలు బ్యాంకులు మ్యుచువల్‌ ఫండ్స్‌పై డిజిటల్‌ పద్ధతిలో లోన్లను ఇస్తున్నాయి. అంటే ఆయా బ్యాంకుల్లో సేవింగ్స్‌ అకౌంట్లు ఉంటే చాలు.. పూర్తిగా పేపర్‌లెస్‌ పద్ధతిలో మ్యుచువల్‌ ఫండ్స్‌పై లోన్లను పొందవచ్చు.

మ్యుచువల్‌ ఫండ్స్‌ మీద లోన్లను తీసుకున్నప్పటికీ వాటిల్లో ఖాతాదారులు పెట్టుబడులు పెట్టడం కొనసాగించవచ్చు. అలాగే వాటిపై వచ్చే డివిడెండ్లను తీసుకోవచ్చు. మ్యుచువల్‌ ఫండ్స్‌ మీద లోన్లను తీసుకుంటే కలిగే లాభాల్లో ఒకటి.. పెట్టుబడిదారులు తమ పెట్టుబడి నష్టపోకుండా ఉంటారు. అయితే అన్ని మ్యుచువల్‌ ఫండ్స్‌ స్కీంలు లోన్లు తీసుకునేందుకు అర్హం కావు. కేవలం కొన్ని స్కీంలలో తీసుకునే మ్యుచువల్‌ ఫండ్స్‌పై మాత్రమే లోన్లను పొందవచ్చు. ఈ క్రమంలో మ్యుచువల్‌ ఫండ్స్‌ తీసుకునేటప్పుడే కంపెనీ ప్రతినిధులతో ఈ విషయాన్ని నిర్దారించుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడి దారులు తమకు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అనుకుంటే.. మ్యుచువల్‌ ఫండ్స్‌ మీద లోన్లు తీసుకుందామనుకుంటే.. అందుకు తగిన విధంగా ఆ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. లోన్లు తీసుకునేందుకు సౌకర్యం కల్పించే మ్యుచువల్‌ ఫండ్స్‌లో మాత్రమే అలాంటి వారు పెట్టుబడులు పెట్టాలి. దీంతో భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఆర్థిక సమస్యలు వస్తే ఆ ఫండ్స్‌ మీద లోన్లను చాలా సులభంగా తీసుకోవచ్చు. లేదంటే కష్టతరమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news