కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాజస్థాన్ రాజకీయ సంక్షోభం వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో నిలుస్తారా లేదా అన్నదానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్ లాంటి నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో దిగ్విజయ్ సింగ్ పేరు ముందే వినిపించింది. అయితే ఆ పదవి పట్ల తాను ఆసక్తిగా లేనంటూ ఆయన ఆ వార్తలను తోసిపుచ్చారు. కానీ, ప్రస్తుతం రాజస్థాన్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో గహ్లోత్‌ను పోటీ నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలో గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండే మరో సీనియర్ నేతకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరారు.
ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ పేరు మరోసారి పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సభ్యుల డిమాండ్ మేరకు దిగ్విజయ్.. అధ్యక్ష ఎన్నిక బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇవాళ ఆయన నామినేషన్ వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.