జిహెచ్ఎంసి ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఎంతగానో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తమవద్ద ఉన్న అన్ని రకాల అస్త్రాలను సంధించారు. అదేసమయంలో అటు అధికారులు కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుని… సరైన అభ్యర్థులను ఎన్నుకుని అభివృద్ధిలో భాగం కావాలి అంటూ ఎన్నో అవగాహన చర్యలు చేపట్టారు కానీ.. గ్రేటర్ ఓటర్ తీరు లో మాత్రం మార్పు రాలేదు.
ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఇప్పటికి కూడా మందకొడిగా సాగుతోంది. ఇల్లు దాటి బయటకి వచ్చి గ్రేటర్ పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎంతో మంది వృద్ధులు గ్రేటర్ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతూ ముందుకు వచ్చి ఓటు వేస్తూ ఉంటే.. ఎంతో బాధ్యతగా వ్యవహరించి.. ఓటు హక్కు వినియోగించుకుని పాలకులను నిర్ణయించవలసిన యువత మాత్రం ఓటు వేసేందుకు అనాసక్తిగా ఉండడం అభ్యర్థుల్లో కూడా నిరాశే మిగులుస్తుంది.