శత్రువు ఎవరో తేలితే స్నేహం ఎవరితో, ఎందుకో అన్నది తేలిపోతుంది. ఇదే పెద్దల మాట. ఒకవేళ తెర వెనుక శత్రువు దాగి ఉండి , స్వార్థ రాజకీయాలు నడిపితే కోలుకోవడం చాలా అంటే చాలా కష్టం. ఏదేమయినప్పటికీ నమ్మకం అన్నదే ప్రధానం. రాజకీయాల్లో శాశ్వత రీతిలో శత్రువులు ఉండరు కదా ! కనుక ఎవరు ఏం చేసినా వాటిపై అదే పనిగా విశ్లేషించే మీడియాలకు కొన్ని అర్థం కావాలి. ఇదే కేసీఆర్ గతంలో కాంగ్రెస్ తో పనిచేశారు అని !విలీన ప్రతిపాదన ముందు ఆయనే తెచ్చారు అని ! ఆ తరువాతే అధినేత్రి సోనియాకు కొన్ని ప్రతిపాదనలు వివరించారు అని ! ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కోలుకోవాలంటే కొత్త పొత్తులపై క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఉంటే ప్రమాదం.
అప్పుడు పీకే చెప్పే ప్రతి మాట ఆచరణీయం కాదు. కనుక కాంగ్రెస్ కు పొత్తుల కన్ ఫ్యూజన్ తీసుకు రావడంలో కనుక పీకే చెప్పే వ్యూహాలన్నవి బెడిసికొట్టి, అవి కాస్త శత్రువులకు అనుకూలంగా ఉపయోగపడితే ఇక కథ తేలినట్లే ! అలాంటప్పుడు కాంగ్రెస్ కు కొత్త శత్రువు ప్రశాంత్ కిశోరే అవుతారు.ఈ దశలో పీకే ఆ పార్టీని వీడి వచ్చారే అనుకుందాం అప్పుడు కూడా నష్టపోయేది ఓ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కానీ, కన్సల్టెన్సీ ఏజెన్సీ నడుపుకునే పీకే ఎంత మాత్రం కాదు అన్నది నిర్థారించుకోవాలి ప్రస్తుత ఏఐసీసీ కీలక నేతలు. అర్థం అవుతుందా ?
కాంగ్రెస్ ను ఎవ్వరూ బాగు చేయక్కర్లేదు.. ఎవ్వరూ పాడు చెయ్యక్కర్లేదు. చెడిపోయినా, బతికి పోయినా అదంతా వాళ్ల
స్వయంకృతం అని అంటుంటారు. అందుకే కాంగ్రెస్ కు కొత్త శత్రువులు ఎవరు అంటే పాత నాయకులే కొత్త శత్రువులు. వాళ్లంతా ముందుకు వెళ్లరు. వెళ్లలేరు. కానీ పార్టీని కూడా అదేవిధంగా వెళ్లనివ్వరు. కొత్త శత్రువులతో పాటు కొత్త విధ్వంసాలు కూడా మొదలయ్యేందుకు పరిణామాలు మారుతున్నాయి. అందుకే పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ప్రశాంత్ కిశోర్ అనే వ్యక్తి ఎంట్రీ ఓ పెద్ద చారిత్రక అవసరం అన్న విధంగా అధినేత్రి భావించడమే ఆశ్చర్యకరం. కానీ కాంగ్రెస్ కు రేపటి వేళ శత్రువు అయితే ప్రశాంత్ కిశోర్ మాత్రమే కావొచ్చు అని కూడా కొన్ని పొలిటికల్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టే క్రమంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతం కాకపోతే, అందుకు పీకే సంధి లేదా రాయబారం ఫలితం ఇవ్వకపోతే ఆయనే ఆ పార్టీకి కొత్త శత్రువు కావడం ఖాయం.
సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ ను ఓడించడం సులువు కాదని అప్పట్లో చాలా సార్లు ఆ పార్టీ నాయకులు పదే పదే చెప్పేవారు. ఆ విధంగా వారు తమ నమ్మకాన్ని భరోసానూ రెట్టింపు చేసేందుకు కొన్ని పనులు సుదీర్ఘంగా చేసేందుకు, సుదీర్ఘ కాలం నిలదొక్కుకునేందుకు ఇష్టపడే వారు. ఓ విధంగా చెప్పుకోవాలని అనుకుంటే కాంగ్రెస్ కు ఒకప్పటిలా వైఎస్సార్ లాంటి బలమైన నాయకులు ఇప్పుడైతే లేరు. అంతేకాదు బలమైన నాయకులు ఉన్నా కూడా వినియోగించుకునే శ్రద్ధ కానీ ఆసక్తి కానీ ఆ పార్టీకి లేనేలేవు. ఈ దశలో ప్రశాంత్ కిశోర్ ఎంట్రీతో కథ మొత్తం మారిపోయింది. కథ మొత్తం మొదటికే వచ్చింది. ఎవరు ఎవరితో ఉంటారో తేలని విధంగా పరిణామాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. కాస్తో కూస్తో గాడిన పెట్టే పనిని ప్రశాంత్ కిశోర్ తీసుకుంటాడు అని అనుకోవడమే ఇప్పటి భ్రమ.