రివర్స్ అవుతున్న ఇళ్ల పట్టాల రాజకీయం… వైసీపీకే దెబ్బ..?

-

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు చేసే పంపిణీ కార్యక్రమం పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టులో పలు కేసులు ఉండటంతో, ఇళ్ల పట్టాల పంపిణీకి బ్రేక్ పడుతుంది. అయితే ఇదంతా టీడీపీ చేస్తున్న పని అని, 30 లక్షల ఇళ్ల పట్టాలని కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అంటే ఇందులో తమ తప్పు ఏమి లేదు, మొత్తం చంద్రబాబుదే అన్న విధంగా వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

తాజాగా అసెంబ్లీలో స్పీకర్‌గా ఉంటూ, బయట పక్కా వైసీపీ నేతగా మాట్లాడే  తమ్మినేని సీతారాం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అసలు కోర్టులనే తప్పుబట్టేలా ఆయన మాట్లాడారు. అయితే ఈ మాటలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు వెంటనే కౌంటర్ ఇచ్చేశారు. ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూముల్లో వైసీపీ నేతలు ఊహించని అవినీతికి పాల్పడ్డారని, భూములు కొనడానికి, చదును చేయడానికి అని చెప్పి లెక్కలేని అక్రమాలు చేశారని అన్నారు. ఇక రాజుగారు మాటలు వాస్తవమే అని తెలుగు తమ్ముళ్ళు ఇళ్ల పట్టాల్లో జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

వాస్తవానికి పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడినట్లు ప్రజలు కూడా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రతిచోటా వైసీపీ నాయకులు ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూముల విషయంలో బహిరంగంగానే అక్రమాలకు పాల్పడిన ఘటనలు చాలానే బయటపడ్డాయి. అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం పేదల దగ్గర నుంచి లంచాలు తీసుకోవడం, భూముల కొనుగోళ్లలో అక్రమాలు, చదును పేరుతో డబ్బులు మింగేయడం చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఇంకా పలు భూములు వివాదాల్లో ఉండటం, అలాగే నిరుపయోగమైన భూములని, వరద ముంపు ఉండే భూములని ఇళ్ల పట్టాలకు కేటాయించడం చేశారు. ఇక ఇవన్నీ ప్రజలకు పూర్తిగా తెలుసని, కాబట్టి ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వమే పేదలని మోసం చేస్తుందని, దాన్ని కవర్ చేయడానికి వైసీపీ నేతలు,చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Latest news