గెలుపెవరిది..డివిజన్ల వారీగా బెట్టింగ్‌రాయుళ్ల కుస్తీ !

-

దుబ్బాక అయిపోయింది. ఇప్పుడు గ్రేటర్ వంతు వచ్చింది. పార్టీల గెలుపోటములపై బెట్టింగ్‌రాయుళ్లు మళ్లీ జులు విదిల్చారు. జోరుగా పందాలు కాస్తున్నారు. కోట్లల్లో బెట్టింగ్‌లు సాగుతున్నాయి. పోలింగ్‌ ముందు వరకు ఉన్న అంచనాలు పోలింగ్‌ తర్వాత మారిపోవడంతో బెట్టింగ్‌లు మర్చుకునే పనిలో పడ్డారు కొందరు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టీ డిసెంబర్‌ 4న జరిగే కౌంటింగ్‌పై ఉంది. ఫలితాలపై సాధారణ జనం ఆసక్తి ఒకటైతే.. బెట్టింగ్‌రాయుళ్ల సందడి మరొకటి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచీ గత ఎన్నికల ఫలితాలను.. దుబ్బాక ఉప ఎన్నిక తీసుకొచ్చిన హీట్‌ను దగ్గర పెట్టుకుని తెగ కుస్తీ పడుతున్నారు పందాలరాయుళ్లు.

ఇప్పుడు గ్రేటర్ లో 150కి 149 డివిజన్లలో పోలింగ్‌ ముగిసింది. ఏ పార్టీ ఎన్నిచోట్ల గెలుస్తుంది అన్న ఉత్కంఠ పెరుగుతోంది. షెడ్యూల్‌ వచ్చిన నాడే రంగంలోకి దిగిన బెట్టింగ్‌ రాయుళ్లు.. పోలింగ్‌ తర్వాత జోరు పెంచారు. సాధారణంగా పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వచ్చేవి. కానీ ఓల్డ్‌మలక్‌పేట్‌లో రీపోలింగ్‌ ఉండటంతో ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం ఉంది.

దాంతో తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా బెట్టింగ్‌లు కాస్తున్నారు పందాలరాయుళ్లు. ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం ఉన్నా.. సోషల్‌ మీడియాలో అనేక సర్వేలు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి కొన్ని పార్టీలకు మొగ్గు చూపే విధంగా ఉండటంతో పెద్దగా ఎవరూ విశ్వసించడం లేదు. కాకపోతే బెట్టింగ్‌ కాసేవారు మాత్రం ప్రధానంగా టీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయి… బీజేపీకి ఎన్నిచోట్ల నెగ్గుతుంది అన్న దానిపై భారీగానే పందాలకు సిద్ధపడుతున్నారు.

ఒక్క తెలంగాణ వారే కాకుండా.. ఏపీ నుంచి కూడా చాలా మంది పందేలాపై ఆరా తీస్తున్నారు. మొత్తం పార్టీలు సాధించే సీట్లు.. కొన్ని కీలక డివిజన్లలో గెలిచే అభ్యర్థులు.. ఇలా ఆయా వివరాలను దగ్గర పెట్టుకుని 5 వేల నుంచి 5 లక్షల వరకు పందేలు కాస్తున్నారు. అలాగే మేయర్‌ పీఠం అధిరోహించేందుకు ఏ పార్టీ సొంతంగా మ్యాజిక్‌ ఫిగర్‌ దాటుతుంది? అలాంటి అవకాశాలు ఉన్నాయా లేవా అని కూడా పందాలరాయుళ్లు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

మ్యాజిక్‌ ఫిగర్‌ కాకపోయినా.. ఎక్కువ సీట్లలో ఏ పార్టీ గెలుస్తుంది.. బీజేపీకి వచ్చే డివిజన్లు ఎన్ని? ఇలా పందాల జోరు పెంచేస్తున్నారు. కొందరైతే ఒకటికి రెండు మూడు రెట్టు ఎక్కువ ఇస్తామని ఆఫర్‌ ప్రకటిస్తున్నారట. కొందరైతే రూపాయి.. రూపాయిన్నర లెక్కన కూడా పందాలు కడుతున్నారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే రూపాయి ఇస్తారు. ఒకవేళ బీజేపీ గెలిస్తే రూపాయిన్నర సమర్పించుకోవాల్సి ఉంటుంది.
ఓల్డ్‌ మలక్‌పేట రీపోలింగ్ అయిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లువలా వచ్చే వీలుంది. ఆ తర్వాత కూడా పందాలు మార్చుకునేందుకు కొందరు కాచుకుని ఉన్నారు.

అంటే ఈరోజు సాయంత్రం నుంచి శుక్రవారం ఫలితాల వెల్లడి వరకూ పందేల రేంజ్‌ కానీ.. పందాలు కట్టే తీరు కానీ మరింతగా మారే వీలుంది. దుబ్బాకలో బెట్టింగ్‌ సందర్భంగా వందల కోట్లు చేతులు మారాయి. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆ రికార్డును బ్రేక్‌ చేస్తాయని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో.. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఎవరికి కలిసి వస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version