ప్రసాద్ ఒక కంపెనీలో ఉద్యోగి. నిత్యం ఆఫీసుకు వెళ్లడం, పనిచేయడం, ఇంటికి రావడం ఇదీ అతని పని. కానీ ఒక రోజు ఎందుకో కోవిడ్ లక్షణాలు అనిపించి టెస్ట్ చేయించాడు. పాజిటివ్ అని తేలింది. దీంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవడం మొదలు పెట్టాడు. అయితే ముందుగా ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్ట్ చేయించినా ఎందుకైనా మంచిదని మళ్లీ ఆర్‌టీ పీసీఆర్‌కు శాంపిల్ ఇచ్చాడు. ఆశ్చర్యం.. ఆ టెస్టులో కోవిడ్ నెగెటివ్ అని తేలింది.
రమేష్ ఒక వ్యాపారవేత్త. నిత్యం బయటే తిరుగుతుంటాడు. అతని ఇంట్లో నెమ్మదిగా ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో అతను కూడా టెస్టులు చేయించుకున్నాడు. నెగెటివ్ వచ్చింది. ర్యాపిడ్ యాంటీ జెన్, ఆర్‌టీ పీసీఆర్ ఏ టెస్టు చేసినా నెగెటివ్ వచ్చింది. దీంతో తనకు కరోనా రాలేదని నిర్దారించుకుని లైట్ తీసుకున్నాడు. కానీ కొద్ది రోజులు పోయాక అతని శరీర రోగ నిరోధక శక్తి తగ్గి కరోనా లక్షణాలు బయట పడి అతనికి కరోనా అని తేలింది.
పైన తెలిపిన రెండు సందర్భాలే కాదు.. ఇంకా ఇలాంటి చిత్రాతి చిత్రమైన అనుభవాలను అనేక మంది ఎదుర్కొంటున్నారు. కారణం.. కోవిడ్ టెస్టులను చేసే విధానాల్లో 100 శాతం కచ్చితత్వం లేకపోవడం.. చాలా మందిలో యాంటీ బాడీల కారణంగా కోవిడ్ ఉన్నప్పటికీ పరీక్షల్లో బయట పడకపోవడం.. వారిలో క్రమేపీ రోగ నిరోధక శక్తి తగ్గి కరోనా రావడం.. ఇలా అనేక మందికి భిన్న రకాల అనుభవాలు ఎదురవుతున్నాయి. అయితే ఎక్కువ శాతం మందికి లక్షణాలు లేకపోయినా కోవిడ్ ఉన్నప్పటికీ తీవ్రత అంతగా లేకపోవడంతో అది మెషిన్లకు కూడా అంతుబట్టడం లేదు. దీంతో టెస్టుల్లో నెగెటివ్ వస్తోంది. ఇక టెస్టులకు ఉపయోగించే ర్యాపిడ్ యాంటీ జెన్, ఆర్‌టీ పీసీఆర్ విధానాలు కూడా 100 శాతం కచ్చితమైన ఫలితాలను ఇవ్వవని సాక్షాత్తూ సైంటిస్టులే చెబుతున్నారు. అందువల్లే కొందరికి మొదట్లో పాజిటివ్ అని తరువాత నెగెటివ్ అని, ఇంకొందరికి మొదట్లో నెగెటివ్ అని, తరువాత పాజిటివ్ అని వస్తోంది. అందువల్ల కోవిడ్ పాజిటివ్ వస్తే ఓకే.. కానీ నెగెటివ్ వస్తే మాత్రం లైట్ తీసుకోవద్దని, జాగ్రత్తగా ఉండాల్సిందేనని.. అనుమానం వచ్చినప్పుడల్లా టెస్టులు చేయించుకోవడం ఉత్తమం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.