వినాయక చవితి పండుగ వస్తుందంటే అందరి మదిలో ముందుగా మెదిలేది ఖైరతాబాద్ బొజ్జ వినాయకుడే. గణేష్ చతుర్థి కోసం భాగ్యనగరం ముస్తాబవుతుంది. భారీ ఆకారంలో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ గణపతికి హైదరాబాద్‌లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. సహజంగా ప్రతి వీధిలో విఘ్నేశుడి విగ్రహాలను పెట్టి భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. ఈ క్రమంలోనే వినాయక చవితి వస్తుందంటే చాలు ఖైరతాబాద్ వినాయకుడు ఏ రూపంలో ఉంటాడో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.
ప్రతి సంవత్సరం 11రోజుల పాటు ఖైరతాబాద్‌లో ఓ పుణ్యక్షేత్రంగా మారుతుంది. లక్షలాది మంది భక్తులు గణపతి దర్శనార్థం ఇక్కడకు వస్తుంటారు. అలాంటి ఖైరతాబాద్‌లో ఈ ఏడాది వినాయకుడు ఎలా ?ఉండబోతున్నాడో తెలుసుకుందాం. ఖైరతాబాద్ గణనాథుడు ఈ ఏడాది 12 తలలు, 24 చేతులు, ఆరు సర్పాలు, సప్తాశ్వాలతో కూడిన సూర్యరథంపై గణనాథుడు కొలువుకానున్నాడు. ఈ విగ్రహాన్ని 61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దుతున్నారు.
అలాగే వినాయకుడి కుడి వైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి.. ఎడమ వైపున బ్రహ్మా, విష్ణు, మహేశ సమేత దుర్గాదేవి ఉండనున్నారు. ఒక్కో తలకు ఒక్కో రకమైన రంగుతో గణనాథుడు రూపుదిద్దుకుంటున్నాడు.
ప్రతి ఏడాది ఏదో ఒక ప్రత్యేకతను చాటే ఖైరతాబాద్ విఘ్నేషుడు ద్వాదశాదిత్య మహా గణపతిగా కొలువుదీరనున్నాడు. మునుపెన్నడూ చూడని భారీ ఆకారంతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.
ఇక విగ్రహ తయారీ కోసం వివిధ రాష్ట్రాల నుంచి 150 మంది కళాకారులు మూడు నెలల పాటు రాత్రుంబవళ్లు శ్రమించినట్లు తెలుస్తోంది. ఈ మహా గణపతిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ రూపంలో వినాయకుణ్ని కొలిస్తే సకాలంలో వర్షాలు పడటంతోపాటు, తాము అనుకున్న కోరికలు నెరవేరతాయని అందరూ భావిస్తారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో ఉండే లడ్డూ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో తయారు చేస్తారు.