చక్కెర లేదా దాంతో తయారు చేసే తియ్యని పదార్థాలను తినడం అంటే మనలో చాలా మందికి ఇష్టమే. నిత్యం ఏదో ఒక రూపంలో చక్కెరను తింటూనే ఉంటారు. అయితే ఏదైనా కొంత మోతాదులోనే తీసుకోవాలి. పరిమితికి మించితే అది దుష్పరిణామాలను చూపిస్తుంది. చక్కెర కూడా అంతే. శరీరంలో చక్కెర ఎక్కువైతే డయాబెటిస్, గుండె జబ్బులు వస్తాయి. అయితే ఒక నెల రోజుల పాటు పూర్తిగా చక్కెర తినడాన్ని మానేస్తే ఏం జరుగుతుంది ? అంటే..
నిత్యం చక్కెరను అధికంగా తినేవారు ఒక్కసారిగా మానేస్తే కొందరికి పదే పదే అవే ఆలోచనలు వస్తాయి. తీపి పదార్థాలను తినాలపిస్తుంది. దీంతో కొందరికి విపరీతమైన ఆకలి అనిపిస్తుంది. అలాంటి వారు తాజా పండ్లను తీసుకుంటూ ఎక్కువగా నీటిని తాగాలి. దీంతో చక్కెర తినాలనే కోరిక నశిస్తుంది. ఇక కొందరు చక్కెర తినడం మానేశాక శక్తి వచ్చినట్లు ఫీలవుతారు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ఫీలింగ్ కలుగుతుంది. అయితే పూర్తిగా నెల రోజుల పాటు చక్కెర తినడం మానేస్తే ఇక చక్కెర తినాలనే కోరిక ఏ మాత్రం కలగదు. వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు. అలాగే శరీరంలో ఈ మార్పులు చోటు చేసుకుంటాయి.
* చక్కెరను తినడం పూర్తిగా మానేస్తే బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. తీపి పదార్థాలను తినాలనే యావ ఉండదు.
* శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.
* అధిక బరువు లేని వారు చక్కెర తినడం మానేస్తే శరీరానికి పోషకాలు అందుతాయి. దీంతో శరీరం తనకు తాను మరమ్మత్తులు చేసుకునేందుకు కావల్సినంత శక్తి, సమయం లభిస్తాయి.
* చక్కెర తినడం మానేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సైంటిస్టుల అధ్యయనాల్లో ఇది వెల్లడైంది.
* దంత క్షయం వచ్చేందుకు కారణం చక్కెర ఎక్కువగా తినడమే. అందువల్ల చక్కెర తినడాన్ని పూర్తిగా మానేస్తే దంత సమస్యలు కూడా రావు.
* చక్కెర తినడం మానేశారు అంటే.. అధిక బరువు, డయాబెటిస్ సమస్యలు రాకుండా చూసుకున్నట్లే.
కనుక నిత్యం తీసుకునే ఆహారాల్లో చక్కెరను తక్కువగా తినడం లేదా పూర్తిగా మానేయడం చేస్తే పైన తెలిపిన లాభాలు పొందవచ్చు. అయితే ఈ సూచన పాటించే ముందు వైద్యులను సంప్రదిస్తే బాగుంటుంది.