మన దేశంలో హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. తెలుగు కాలమానం ప్రకారం భాద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు.
మన దేశంలో హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. తెలుగు కాలమానం ప్రకారం భాద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. సాధారణంగా ప్రతి ఏటా ఈ పండుగ ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 15వ తేదీల మధ్య వస్తుంటుంది. అయితే దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. కానీ అసలు ఈ వేడుకలు ఎలా ప్రారంభమయ్యాయో తెలుసా..? అదే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పట్లో మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు నాయకుడు బాలగంగాధర్ తిలక్ ప్రజలను ఒక్క తాటిపైకి తెచ్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేలా ఉద్యమించేందుకు, వారిని ఐక్యం చేసేందుకు వినాయక చవితి ఉత్సవాలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం ప్రారంభించారు. 1893వ సంవత్సరంలో తిలక్ అలా వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారు. అంతకు ముందు గణేష్ చతుర్ధి అంటే కేవలం డబ్బున్న వ్యక్తులు చేసుకునే ప్రైవేటు వేడుకలా ఉండేది. కానీ తిలక్ ఆ భావాన్ని పూర్తిగా మార్చేశారు.
పేద, ధనిక, వర్ణ భేదాలు లేకుండా అందరూ ఒక్క తాటిపైకి వచ్చి సామూహికంగా పండుగ వేడుకలను జరుపుకుంటే ప్రజల మధ్య ఎలాంటి తారతమ్యాలు ఏర్పడవని, దాంతో వారందరూ ఐకమత్యంగా ఉండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని అప్పట్లో తిలక్ నమ్మారు. అందుకనే ఆయన ఇలా గణేష్ వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం మొదలు పెట్టారు. అదే ఇప్పటి గణేష్ ఉత్సవాలకు మూలం అని చెప్పవచ్చు. తిలక్ చేసిన ఆలోచన వల్ల నిజంగానే ప్రజల్లో మార్పు కనిపించడం విశేషం. అది ఆ తరువాత స్వాతంత్య్ర ఉద్యమం మరింత తీవ్రతరం అయ్యేందుకు దోహదం చేసింది. అలా గణేష్ చతుర్ధి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి..!