బతుకమ్మను శివలింగం ఆకారంలో ఎందుకు పెడతారో తెలుసా?

-

తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మను జరుపుకుంటారు.. ప్రతి ఏడాది ఇలా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.వేములవాడ చాళుక్యుల సామంతులుగా ఉండేవారు. క్రీ.శ 973లో చాళుక్య రాజైన తైలపాడు.. రాష్ట్రకూటుల చివరి రాజైన కర్కుడిని వధించి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పి కుమారుడు సత్యాశ్రయుడికి పట్టాభిషేకం చేయించాడు. అప్పటి వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవాలయముంది. ప్రజలు ఆ దేవిని విశేషంగా ఆరాధించేవారు. చోళరాజులు కూడా రాజరాజేశ్వరిని విశ్వసించేవారు..


985 నుంచి 1014 వరకు రాజ రాజ చోళుడు రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆ తర్వాత వచ్చిన రాజేంద్ర చోళుడు… సత్యాశ్రయుడిని యుద్ధంలో ఓడించి వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేశాడు. ఈ ఆలయంలోని ఉన్న భారీ శివలింగాన్ని రాజేంద్ర చోళుడు తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. ఆ శివలింగాన్ని 1010లో నిర్మించిన బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించారు. పార్వతిసమేతుడై ఉన్న శివలింగాన్ని వేరుచేసి రాజేంద్ర చోళుడు బృహదీశ్వరాలయంలో ప్రతిష్టించినట్టు తమిళ శిలాశాసనాల్లో రాసి ఉన్నారు.

శివలింగాన్ని వేరుచేసి తంజావూరులోని బృహదీశ్వరాలయంలో ప్రతిష్టించడం ఇక్కడి ప్రజలను కలిచివేసింది. బృహదమ్మ నుంచి శివుని లింగాన్ని వేరుచేసినందుకు దుఃఖిస్తూ…తమ బాధను చోళులకు తెలియజేసేందుకు శివలింగాకారంలో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచీ ఏటా బతుకమ్మను ఇలా పూలతో పేర్చి మధ్యలో గౌరమ్మని తలపించేలా పసుపుముద్దను పెడతారు.ఇలా ఏళ్ళు గడుస్తున్న శివుడు రాలేదని పాట కూడా పాడతారు.. ఆ పాటలు ఏంటో ఒకసారి చుద్దాము..

ఒక్కేసి పూవ్వేసి చందమామ..ఒక్క జాములాయె చందమామ

జాముజాముకూ చందమామ..శివుడు రాకాపాయే చందమామ
రెండేసి పూలేసి చందమామ..రెండు జాములాయె చందమామ
జాముజాముకూ చందమామ..శివుడు రాకాపాయే చందమామ
మూడేసి పూలేసి చందమామ..మూడు జాములాయె చందమామ
జాముజాముకూ చందమామ…శివుడు రాకాపాయే చందమామ
నాలుగేసి పూలేసి చందమామ..నాలుగు జాములాయె చందమామ
శివపూజ వేలాయె చందమామ..శివుడు రాకాపాయే చందమామ
ఐదేసి పూలేసి చందమామ..ఐదు జాములాయె చందమామ
శివపూజ వేలాయె చందమామ..శివుడొచ్చి కూర్చునే చందమామ

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే
రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

వెండి బింద తీసుక వెలది నీళ్లకు వోతే
వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

బంగారు బింద తీసుక బామ్మా నీళ్లకు వోతే
భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

పగిడి బింద తీసుక పడతి నీళ్లకు వోతే
పరమేశు డెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

ముత్యాల బింద తీసుక ముదిత నీళ్లకు వోతే
ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

Read more RELATED
Recommended to you

Latest news