బతుకమ్మ పేర్చడానికి ఆ పూలే ఎందుకు వాడతారో తెలుసా.. ?

-

సాధారణంగా పూలతో దేవుళ్లని కొలుస్తాం. కానీ పూలనే దైవంగా భావించి పూజించడమేగాక.. తొమ్మిది రోజులు అంగరంగవైభవంగా అద్భుతమైన వేడుకలా జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమై.. ప్రపంచవ్యాప్త గుర్తింపును దక్కించుకున్న ఒకేఒక పండుగ బతుకమ్మ. బతుకమ్మను తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి తీరొక్క పూలతో పేరుస్తారు. మరికొద్ది రోజుల్లో మొదలవ్వనున్న బతుకమ్మ సంబురాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి యావత్ తెలంగాణ ఆడపడుచులు ఎదురుచూస్తున్నారు. తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో పేర్చే బతుకమ్మలో ఎలాంటి పూలు ఉపయోగిస్తారు. వాటి వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసా..?

“ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ.. తంగేడు కాయొప్పునే గౌరమ్మ”….. బతుకమ్మ “బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో”…..”రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో..” అంటూ ఇల రకరకాల పాటలతో బతుకమ్మను అదేనండీ మన గౌరమ్మను కొలుస్తారు మహిళలు. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ రూపంలో ఉండే గౌరమ్మకు తీరొక్క పూలతో ముస్తాబు చేస్తాం. తంగేడు, గునుగు, బంతి, చామంతి, మందార, ఉమ్మెత్త, గులాబీ, నందివర్దనం, తామర పూలన్నీ ఈ కాలంలో దొరికేవే.  మన పూర్వీకులు చెప్పే ప్రతిమాటలో.. చేసిన ప్రతి పనిలో ఆచారానికి సంబంధించే కాకుండా శాస్త్రీయపరంగా కూడా నిగూఢార్థం ఉంటుంది. అలాగే బతుకమ్మను పేర్చే పూలకు కూడా ఉంది. ఈ పూలు కేవలం బతుకమ్మను అలంకరించడానికే కాదు.. వీటిని ఉపయోగించడం వెనుక ఎన్నో ఆరోగ్య సూత్రాలున్నాయట.

తంగేడు :

బతుకమ్మను పేర్చడంలో మొదటగా ఉపయోగించేది తంగేడు పువ్వు. ఇది లేకుండా బతుకమ్మను అసలు పేర్చరు. ఒక్క పూవైనా తంగేడు ఉండాల్సిందే. అలా ఉన్నప్పుడే గౌరమ్మ సంతృప్తి చెందుతుందట. పసుపు రంగులో ఉండే ఈ పూలే కాదు.. మొక్కలోని ప్రతి భాగమూ ఔషధ గుణాలున్నదే. వీటిని మధుమేహం, అల్సర్‌, మలబద్ధక నివారణకే కాకుండా సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు.

బంతి :

బంతి పూలు మధ్యతరగతి ప్రజలకు లిల్లీ ఫ్లవర్స్​ లాంటివి. ముఖ్యంగా బతుకమ్మ పేర్చేటప్పుడు బంతి పూలకు ఉండే క్రేజే వేరు. ఈ పూలు బతుకమ్మకు నిండుదనాన్ని తీసుకొస్తాయి. పండుగ, పూజ ఏదైనా ఈ పూలకే ప్రాధాన్యం. దీనిలో విటమిన్‌ సి, ఫ్లావనాయిడ్‌ గుణాలుంటాయి.

గునుగు :

తంగేడు తర్వాత బతుకమ్మను పేర్చడంలో కీలకమైంది గునుగు. పండుగకు పది రోజుల ముందే పల్లెల్లో గునుగు కోసుకురావడానికి మహిళలు చేన్ల బాట పడుతుంటారు. బతుకమ్మ సమీపించకముందే గునుగును రకరకాల డిజైన్లలో కోసి బతుకమ్మ పేర్చడానికి రెడీగా ఉంచుతారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అలంకరణ కోసం ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ డయాబెటిక్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలెక్కువ. దెబ్బలు, కాలిన గాయాలు, కడుపునొప్పి మొదలైనవాటికి మంచి మందు.

మందార :

మందారపువ్వును రోజూ పూజలో వాడతాం. బతుకమ్మకు ఈ పూలు మరింత అందాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా ఎరుపు రంగు మందారాలతో బతుకమ్మ పేరిస్తే వచ్చే అందమే వేరు. పువ్వే కాదు.. ఆకులు, కాండాల్లోనూ బోలెడు ఔషధ గుణాలు. విటమిన్‌ సి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఎక్కువగా సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తారు.

గులాబీ :

గులాబీ పూలు సాధారణంగా పూజలో వాడరు. కానీ బతుకమ్మలో మాత్రం తప్పకుండా వాడతారు. బతుకమ్మను పేర్చిన తర్వాత గౌరమ్మ చుట్టూ పెట్టడానికో లేదా బతుకమ్మ చుట్టూ పెట్టడానికి ఈ పూలు ఎక్కువగా వాడతారు. ఎండిన పూరేకలను తలనొప్పి చికిత్సకు ఉపయోగిస్తారు. రోజ్‌వాటర్‌ ముఖానికి తాజాదనాన్ని అందిస్తుంది. చర్మం కింద వాపు వంటివాటినీ అరికడుతుంది.

నందివర్దనం :

నందివర్దనం పూలను ఎక్కువగా రోజువారి పూజలో వాడతారు. ఈ పూలను కూడా గులాబీల మాదిరి బతుకమ్మపైన భాగంగా గౌరమ్మ చుట్టూ అలంకరిస్తారు. రక్తపోటు నివారణ మందుల్లో ఈ పూలను వాడతారు. ఇంకా గాయాలు, కార్డియోవాస్క్యులర్‌, యాంటీ ట్యూమర్‌, యాంటీ ఇన్ఫెక్షన్‌, యాంటీ ఆక్సిడేటివ్‌ ఔషధాల్లోనూ వినియోగిస్తారు.

తామర :

బతుకమ్మకు మరింత అందాన్ని తీసుకొచ్చే పూలలో తామర ముందు ప్లేస్​లో ఉంటుంది.  ఈ పూలలో మెడిసినల్‌ గుణాలెక్కువ. పురాతన కాలం నుంచీ ఎన్నో వ్యాధుల నివారణకు దీన్ని ఉపయోగిస్తున్నారు. దగ్గు, క్యాన్సర్‌, జ్వరం, నెలసరి సమస్యలు, మొటిమలు, కొలెస్టరాల్‌, మూత్రపిండ సంబంధ వ్యాధులు, మధుమేహం మొదలైన వాటి నివారణ మందుల తయారీలో ఇది తప్పనిసరి.

చామంతి :

చామంతి పూలను బతుకమ్మను పేర్చిన తర్వాత మరింత అందంగా కనిపించడాని చుట్టూ పెడుతుంటారు. అలాగే గౌరమ్మ చుట్టూ వీటిని ఎక్కువగా అలంకరిస్తుంటారు. బతుకమ్మను పేర్చగా మిగిలిన చామంతి పూలను మహిళలు గౌరమ్మ దీవెనగా భావించి తల్లో పెట్టుకుంటారు. చామంతి పూలలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్‌, క్యాల్షియం, ఐరన్‌, సోడియం వంటి మినరల్స్‌ ఉంటాయి. వివిధ వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువే.

ఇలా..

ప్రతి పువ్వూ ఓ ఔషధ గనే! మగవాళ్లు పూలను తెస్తే.. ఆడవాళ్లు పూజ చేసి, తనివితీరా బతుకమ్మ పాటలు పాడుతూ కోలాహలంగా ఎంతో సంబురంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. అనంతరం దగ్గరలోని బావి, చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేస్తారు. అలా నీటిలోని సూక్ష్మజీవులు నశించడమే కాదు.. వాటిని తాగినవారికీ ఆరోగ్యం సహజసిద్ధంగా లభిస్తుందన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news