‘‘రైతులకు మా ప్రభుత్వం ఎలాంటి నష్టం చేకూర్చలేదు. కొత్త చట్టాలతో రైతులు పండించిన పంటను ఎక్కడైనా తమకు అనుకూలమైన ధరకు అమ్ముకోవచ్చు.’’ అని కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము ప్రజలకు వివరించేదుకు ప్రయత్నిస్తుంటే కొందరూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. అన్నదాతలు చర్చలకు వస్తేనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.
నూతన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అన్నదాతలు గత కొన్ని రోజులుగా చేపట్టిన ఉద్యమంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దిల్లీ, హరియానాలోని సింఘూ, టిక్రీ వద్ద నిరసనలు కొనసాగుతుండగా 20వ రోజు హస్తినా సరిహద్దులో ఉద్యమం ఉధృతం అయ్యే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చర్చలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చిన విషయం తెలిసింది. తాజాగా మంత్రి గడ్కరీ ఎంత త్వరగా చర్చలకు వస్తే అంత త్వరగా రైతన్నల సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పిలుపునిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంతరం రైతుల క్షేమం గురించి ఆలోచిస్తోందన్నారు. చర్చలకు వచ్చి నూతన చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. మేము రైతన్నల గురించి మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని జీర్ణించుకోలేని కొందరూ వ్యక్తులు వారిని రెచ్చగొట్టి రైతులకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నారని పరోక్షంగా ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు ఉద్యమం ఉధృతం కానున్న నేపథ్యంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతు సంఘాలతో సమావేశం కానున్నట్లు సమాచారం. రైతు సంఘాలు, నేతలతో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు దిల్లీ శివార్లోని రైతులతో కూడా సమావేశం నిర్వహించి తదుపరి కార్యచరణపై ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. నూతన చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతన్నలు చేపడుతున్న ధర్నాలు, రాస్తారోకోలో దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మద్దతు తెలుపుతూ పలు ప్రాంతాల్లో ధర్నాలో పాల్గొంటున్నారు.