కరోనా వైరస్ ( Corona Virus ) వచ్చాక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అందరికీ పెరిగింది. అందుకే ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత వచ్చే దీర్ఘకాలిక సమస్యలకు చాలామంది భయపడుతున్నారు. అందులో మెదడుపై కరోనా ప్రభావం ఉంటుందన్న వార్తలు కూడా ఉండడంతో అది ఆందోళనగా మారింది. మెదడుపై కరోనా ప్రభావం ఎంతలా ఉంటుంది అనేది ఇక్కడ తెలుసుకుందాం.
WebMD అధ్యయనం ప్రకారం కరోనా కారణంగా ఏడుగురిలో ఒక్కరి మెదడు మీద ప్రభావాలు కలుగుతున్నాయని పేర్కొంది. కన్ఫ్యూజన్, కంగారు,. వాసన కోల్పోవడం, గుండెపోటు మొదలగు ఇబ్బందులు కలుగుతున్నాయని, అవి ఒక్కోసారి మరణాలకు కూడా దారితీస్తున్నాయని తెలిపారు.
కొన్ని కొన్నిసార్లు మెదడులోకి వైరస్ చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని, దానివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. రక్తం గడ్డకట్టడం కూడా ఇందుకు కారణంగా నిలుస్తుందని అంటున్నారు.
ఐతే కరోనా వల్ల మెదడుకి వచ్చే ఇబ్బందులు కరోనా నుండి రికవరీ అయ్యాక వస్తున్నాయని, ముఖ్యంగా జ్ఞాపకశక్తి కోల్పోవడం, దృష్టి నిలపకపోవడం, అలసట, వాసన కోల్పోవడం, రుచి తెలియకపోవడం, తలనొప్పి, స్ట్రోక్ మొదలగునవి ఉంటున్నాయి. ఇవన్నీ జరగడానికి ఎక్కువ రోజులు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడమే అని చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. దానివల్ల మెదడుపై కరోనా ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని వైద్యుల మాట.