రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి గడ్డుకాలం నడుస్తుంది. ఒకరకంగా నమ్మినవారే నట్టేట ముంచుతున్నారు. స్థానిక ఎన్నికల సమరానికి సిద్దం అవుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చారు ఇద్దరు సీనియర్ నేతలు. గతంలో మంత్రి గా పని చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ లు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆ వెంటనే వైసీపీ లో తీర్థం పుచ్చుకున్నారు.
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా డొక్కా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజధాని అమరావతి ప్రాంతంలోను, అబ్దుల్ రెహమాన్ రాష్ట్ర పరిపాలనా రాజధానిగా ఏర్పాటు కానున్న విశాఖపట్నంలోను గతంలో కీలక నేతలుగా వ్యవహరించారు. కొద్ది రోజుల క్రితం డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ అది ఇప్పటి వరకూ ఆమోదించబడలేదు.
ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీ లో చేరిన డొక్కా అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2014-2015 లోనే వైసీపీలోకి రావాలని అనుకున్నాను అని అయితే కొన్ని కారణాలవల్ల అప్పుడు వీలు కాలేదు అని, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుడినై ఆయన నాయక్వంలో పని చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక రెహమాన్ మాట్లాడుతూ మద్యపాన నిషేధంతో,
ముఖ్యమంత్రి వైఎస్ జగన్న చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. తాను ఎలాంటి పదవులు ఆశించి వైసీపీలోకి చేరలేదని, జగన్ పాలనా విధానాలు నచ్చి ఆయన నాయకత్వాన్ని బలపరిచేందుకే పార్టీలో చేరుతున్నట్లు అన్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వెంటనే టీడీపీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. డొక్కా కాంగ్రెస్ లో మంత్రిగా పని చేసారు. గత ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.