ఒక పక్క కరోనా, మరోపక్క నిరసనాలతో అగ్రరాజ్యం అట్టుడుకిపోతుంది…ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల అమెరికా పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, హింస చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మద్దతు పలుకుతున్నారు. అయితే నిరసనకారులపై అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో నిరసనలకు మద్దతు పలుకుతూ తండ్రికి షాక్ ఇచ్చింది ట్రంప్ చిన్న కూతురు టిఫాని ట్రంప్. నిరసనకు మద్దతుగా నలుపురంగును తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ.. ఒంటరిగా పోరాడితే ఫలితం అంతగా ఉండదని, అందరూ కలిసి నడిస్తే చాలా సాధించవచ్చన్న హెలెన్ కెల్లర్ వ్యాఖ్యలను ఆమె క్యాప్షన్‌గా రాయడం గమనార్హం. ఆమె ఈ విధంగా మద్దతు పలకడం పట్ల సామాజిక మాధ్యమాల్లో ఆమెపై ప్రశంసల జల్లుకురుస్తోంది.