పూర్వ కాలంలో వర్తకవ్యాపారులు వారి వస్తువులను మోయడానికి గాడిదలను ఉపయోగించారు. ముఖ్యంగా రజకులు బట్టల్ని గాడిదలపై వేసి తీసుకెళ్లేవారు. అంతేకాదు వ్యాపారస్తులు సైతం తమ వస్తువులను ఒక చోటు నుంచి మరోచోట తరలించేందుకు గాడిదలను ఉపయోగించుకునే వారు. అయితే ప్రస్తుతం కాలంలో మార్పులు వచ్చాయి. గాడిదల వినియోగం బాగా తగ్గిపోయింది. అంతేకాదు చూద్దామన్న కనిపించడం లేదు. అయితే గాడిద పాలుతో అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చనేప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అప్పుడప్పుడు గాడిదలను అలా చూస్తూ ఉన్నాం. ఈ గాడిదల పాలుకు మామూలు రేటు లేదు.
అలా బరువు మోసేందుకు ఉపయోగించే గాడిదలు అక్కడ ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తింపు ప్రకటించింది. టర్కీలోని ఓ పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నిత్యం ప్రజల మధ్యలో తిరుగుతున్నాయి. అక్కడి మున్సిపాలిటీలో పదుల సంఖ్యలో గాడిదలు చక్కగా తమకు కేటాయించిన పనులు నిర్వర్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే టర్కీలోని మార్డిన్ ప్రావిన్స్‌లో అర్తుక్లు అనే పట్టణం ఉంది. ఇక్కడి మున్సిపాలిటీ విభాగంలో కొన్నేళ్లుగా గాడిదలు ఊరంతా తిరుగుతూ చెత్త సేకరణలో ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే.. అర్తుక్లులో చాలావరకు ఇళ్లు ఇరుకు వీధుల్లో ఉంటాయి.
ఇంటి ముందర నిచ్చెనలు, మెట్లు ఉంటాయి. దీంతో చెత్త సేకరించే మున్సిపల్ వాహనాలు ఆ వీధుల్లోకి వెళ్లలేవు. అందుకే టర్కీలో విరివిగా కనిపించే గాడిదల్ని చెత్త సేకరణకు ఉపయోగించుకోవాలని అక్కడి ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. సాధారణంగానే గాడిదలు బరువు మోయడానికే ఉపయోగపడతాయి. అలా దాదాపు 40 గాడిదలను చెత్త సేకరించే ఉద్యోగులుగా నియమించుకున్నారు. ఒక్కో గాడిద వెంట ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడు ఉంటాడు. అతడు చెత్త తీసుకొని గాడిదపై ఉండే చెత్తసంచుల్లో వేస్తాడు. అలా వీధులన్నీ తిరుగుతూ రోడ్డుపై, ఇళ్లలో ఉండే చెత్తను గాడిద మోసుకెళ్లి డంపింగ్‌యార్డ్‌లో పడేస్తుంది.
ఈ గాడిదలు ప్రభుత్వ ఉద్యోగులలాగే రోజుకు ఆరు గంటలు పనిచేస్తాయి. షిఫ్ట్ పద్ధతిలో ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు విధులు నిర్వర్తిస్తాయి. ఆ తర్వాత మున్సిపాలిటీ కేటాయించిన ప్రాంతంలో సేదతీరుతాయి. ఇలా ఒక్కో గాడిద కనీసం ఏడేళ్లపాటు పనిచేసి రిటైర్ అవుతుందట.. అలా ఉద్యోగం నుంచి రిటైర్ అయిన గాడిదలకు స్థానిక ప్రభుత్వమే ఆశ్రయం కల్పిస్తుంది. 2017 డిసెంబర్‌లో మూడు గాడిదలు రిటైర్ అయినప్పుడు ప్రభుత్వం భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి.. వాటిని సన్మానించింది. ఉద్యోగులు గాడిదలకు ఆహారంగా పండ్లు, కూరగాయాలు తెచ్చి ఇచ్చారు. అప్పట్లో ఆ వార్తను టీవీ ఛానళ్లు దేశవ్యాప్తంగా ప్రసారం చేశాయి.