యూట్యూబ్.. ఇప్పుడు ప్రపంచానికే గురువుగా మారింది. యూట్యూబ్ చూసి ఏకంగా దొంగతనాలు కూడా కొందరు ప్లాన్ చేస్తున్నారు. ఏంచేయాలన్నా అందుకు సలహా ఇచ్చేవారు యూట్యూబ్ లో కోకొల్లలుగా ఉన్నారు. అందుకే చాలామంది ఏ సమస్య వచ్చినా యూట్యూబ్ వైపే చూస్తున్నారు. అందులో ఇచ్చే సలహాలు వాస్తవమా కాదా..? ఆచరణీయమేనా అనేది
పరిశీలించకుండా పాటించేస్తున్నారు.
ఏ విషయం సంగతి ఎలా ఉన్నా.. ప్రత్యేకించి ఆరోగ్యానికి సంబంధించి యూట్యూబ్ లో చూసి చిట్కాలు పాటించవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేస్తే ఇతర అనారోగ్యాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రత్యేకించి ఆయుర్వేదం అని.. ప్రకృతి వైద్యం అని చాలామంది వీడియోలు పెడుతున్నారు. ఇవి ప్రాధమికంగా ఓ అవగాహన తెచ్చుకోవడానికి ఉపయోగపడినా.. వాటిని వాడాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుల సలహాలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
అనారోగ్యానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరతత్వం, వాతావరణ మార్పులు, ఆహార అలవాట్లు, కాలుష్యం, జీవన శైలి, వ్యాయామం లేకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి, నిద్రలేమి.. ఇలా ఎన్నో అంశాలు అనారోగ్యానికి కారణమవుతాయి. ఇందులో ఏది కారణమో సరిగ్గా తెలుసుకోకుండా చాలా మంది యూట్యూబ్లో తమ కోసమే చెబుతున్నట్లుగా భావించి వాటిని పాటించడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.