డీఆర్‌డీవో దూకుడు.. 35 రోజుల్లో 10 క్షిపణి ప్రయోగాలు..!

-

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట చైనాతో ప్రతిష్టంబన మొదలైన నేప‌థ్యంలోనే భారత ప్ర‌భుత్వం అప్రమత్తమైంది. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నేప‌థ్యంలో వ్యూహాత్మక క్షిపణులన్నింటినీ భారత్‌లోనే తయారు చేయాలన్న ప్రధాని న‌రేంద్ర మోడీ పిలుపు మేర‌కు క్షిపణి తయారీలో డీఆర్‌డీవో దూకుడు పెంచింది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల క్షిపణి ప్రయోగాల్లో వేగం పెంచింది. గ‌డిచిన 35 రోజుల్లో భారత్‌ క్షిపణి ప్రయోగాల సంఖ్య మొత్తం 10కి చేరుతుంది. గత నెల లో 4 రోజులకు ఒక క్షిపణిని ప్రయోగించిన డీఆర్‌డీవో.. వచ్చే వారంలో 800 కిలోమీటర్ల పరిధి గల నిర్భయ్‌ సబ్‌-సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని పరీక్షించనుంది.

చైనా అంత సులువుగా వెనక్కి వెళ్లదని భారత్‌ ముందే పసిగట్టిందని, ఈ నేపథ్యంలోనే డీఆర్‌డీవో శరవేగంగా క్షిపణులను తయారు చేస్తోందని ర‌క్ష‌ణ శాఖ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. ఈక్ర‌మంలోనే 400 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను తునాతునకలు చేయగల బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి, అణు సామర్థ్యం కలిగిన శౌర్య సూపర్‌ సోనిక్‌ క్షిపణి, సబ్‌మెరైన్లను ధ్వంసం చేయగల క్షిపణి సహాయక టోర్పెడో, లేజర్‌ గైడెడ్‌ యాంటీ టాంక్‌ క్షిపణి వంటి కీలక ప్ర యోగాలను డీఆర్‌డీవో విజయవంతంగా పూర్తి చేసింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. న్యూక్లియర్‌ సామర్థ్యంతో 300కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి పృథ్వి-2 ప్రయోగాన్ని రాత్రి సమయంలో నిర్వహించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలంపైకి దాడి చేసే తొలి దేశీయ తయారీ క్షిపణి. ఇప్పటికే సరిహద్దు వెంబడి నిర్భయ్‌ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ‌ని, త్వరలో శౌర్య క్షిపణులు కూడా బరిలోకి దిగుతాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news