మనకు అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే కూరగాయల్లో క్యారెట్ ఒకటి. దీన్ని కొందరు కూరల్లో వేసుకుంటారు. కొందరు పచ్చిగా తింటారు. అయితే కొందరు క్యారెట్‌ను తినేందుకు ఇష్టపడరు. కారణం.. అది తియ్యగా ఉండడమే. అలాంటి వారు దీన్ని జ్యూస్ చేసుకుని తాగవచ్చు. నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.
* క్యారెట్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల కంటి సమస్యలు పోతాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. విటమిన్ ఎ లోపం వల్ల కంటి సమస్యలు వస్తాయి. అలాంటి వారు నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే కొద్ది రోజుల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది.
* మన శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ అనబడే అణువులు ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతుంటాయి. వీటి వల్ల శరీర రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. క్యాన్సర్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సదరు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో శరీరం సురక్షితంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
* క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీరం వాపులకు గురి కాకుండా ఉంటుంది. బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. క్యారెట్లలో ఉండే విటమిన్ బి6, కె, పొటాషియం, పాస్ఫరస్ లు ఎముకలను దృఢంగా మారుస్తాయి. నాడీ మండల వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
* క్యారెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన మినరల్స్ కణజాలం నాశనం కావడాన్ని తగ్గిస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం పొడిబారకుండా మృదువుగా మారుతుంది. చర్మం రంగు మారుతుంది. మచ్చలు తొలగిపోతాయి.
* నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం పరిరక్షించబడుతుంది.