ఈ-సిగరెట్ అంటే.. ప్రభుత్వం ఎందుకు నిషేధించింది ?

-

సరదా సరదా సిగరెట్టు… అన్నాడో కవి. అలా బాల్యం లేదా యవ్వనంలో సరదా కాస్తా బానిసగా మారుస్తున్న పెద్ద ప్రమాదకర అలవాటు సిగరెట్. అయితే సాధారణ సిగరెట్ అలవాటు మారాలని చాలామంది ఈ సిగరెట్‌ను అలవాటు చేసుకుంటున్నారు. ఇది సాధారణ సిగరెట్ అంత ప్రమాదం కాదని అంటారు. కానీ ఇది కూడా ప్రమాదకారే. కేంద్రం ఈ సిగరెట్‌ను నిషేధించిన సందర్భంగా ఈ సిగరెట్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం…

ఈ సిగరెట్: సిగరెట్ లేదా పెన్నులాగా ఉండే ఎలక్ట్రానిక్ పరికరం. వీటిలో పొగాకు ఉండదు. రకరకాల ఫ్లేవర్లతో కూడిన నికోటిన్ ద్రావకం, ఇతర రసాయనాలు ఉంటాయి. ఇది సిగరెట్ అంత ప్రమాదకరం కాకపోయినా, వీటిలో ఉండే రసాయనాలు కూడా హానికరమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ-సిగరెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు అందులోని నికోటిన్ ద్రావకం పొగలాగా మారి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. సిగరెట్ తాగిన అనుభూతినిస్తుంది. అందుకే.. సిగరెట్ మానాలనుకునేవారు ఈ-సిగరెట్లవైపు మళ్లుతారని ఒక అంచనా. అయితే, అసలు సిగరెట్ అలవాటు లేని యువత ఈ-సిగరెట్లవైపు ఆకర్షితులవుతున్నారు. అందుకే దీనిని కేంద్రం నిషేధించింది.

ఎలా పనిచేస్తుంది?

ఈసిగరెట్లలో ద్రవరూపంలో ఉండే నికోటిన్ అనే పదార్థం వేడెక్కి ఆవిరిగా మారి పొగ పీల్చడానికి అనువుగా మారుతుంది. పెన్నులాగా ఉంటే ఈ పరికరాన్ని నాలుగు గంటలు చార్జీంగ్ పెడితే ఏకంగా గంట పాటు పొగపీల్చవచ్చు. 20 సిగరెట్లలో ఎంత నికోటిన్ ఉంటుందో, ఇ-సిగరెట్ ఒక్క కేట్రిడ్జ్‌లో అంతే పరిమాణంలో నికోటిన్ ఉంటుంది. దేశంలో 460 ఈ-సిగరెట్ బ్రాండ్లు 7,700 ఫ్లేవర్స్‌లో లభిస్తున్నట్లు సమాచారం. అయితే ఇవేవీ భారత్‌లో తయారుకాకపోవడం మరో విశేషం. దీనికితోడు యువతను బానిసగా చేయడానికి దీనిలో రకరకాల ప్లేవర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

సాధారణ సిగరెట్లు కాల్చడం కంటే ఆవిరితో కూడిన పొగ పీల్చడం ఆరోగ్యానికి అత్యంత హానికరం అని పలు నివేదికలు ఇప్పడికే వెల్లడించాయి. ముఖ్యంగా యువతపై దీని ప్రభావం తీవ్రంగా ఉందని, ఈసిగరెట్లను నిషేధించాల్సిన సమయం వచ్చిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. పొగతాగడం కంటే ఈ-సిగరెట్స్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా కంటే భారత్‌లోనే ఈసిగరెట్లను పీల్చడం ఒక ఫ్యాషన్‌గా మారింది. రకరకాల బ్రాండ్లు, ఫ్లేవర్లతో యువత వీటికి బానిసలవుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా చైనాలో పొగాకు పీలుస్తుండగా, రెండోస్థానంలో భారత్ ఉండటం మరో గమనించాల్సిన అంశం.

ఇప్పటికే పలు రాష్ర్టాలలో నిషేధం!!

భారత్‌లో ఇప్పటికే 14 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈసిగరెట్లపై నిషేధం విధించారు. అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, థాయ్‌లాండ్ సహా 31 దేశాలు ఈసిగరెట్లపై నిషేధం విధించాయి. అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రం వీటిపై నిషేధం విధించింది. అమెరికాలో దాదాపు 30 లక్షల మంది రెగ్యులర్‌గా ఈసిగరెట్లను వాడుతున్నారు. త్వరలో మరికొన్ని దేశాలు వీటిని బ్యాన్‌చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా ఈ సిగరెట్ల నిషేధం ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం తీసుకున్న పెద్ద చర్యగా భావించవచ్చు. అసలు పొగాకు ఉత్పత్తులనే బ్యాన్ చేస్తే మంచిది కదా అని యువత, నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news