ఎలక్షన్ వాచ్ సభ్యులతో తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశం అయ్యారు. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడం ఎలా అనే దాని పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరిలో గ్రేటర్ ఎలెక్టెడ్ బాడీ పదవీ కాలం ముగుస్తుందని అంతకు మూడు నెలల ముందే కొత్త బాడీ ని ఎన్నుకోవాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నుండి ఓటర్ జాబితా రాగానే వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన అన్నారు.
డివిజన్ వారిగా ఓటర్ లిస్టు తయారీ ప్రక్రియ పూర్తి కాగానే పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక గ్రేటర్ లో గత ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉన్న నేపధ్యంలో దానిని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన అన్నారు. సివిక్ సొసైటీస్ తో కో ఆర్డినేట్ చేసుకోవడానికి లైసెనింగ్ ఆఫీసర్స్ ని నియమిస్తున్నామని అన్నారు. అలానే పోలింగ్ బూత్ కి రాలేని వారి కోసం ఈ ఓటింగ్ అంశం పైలట్ బేసిస్ లో పరిశీలనలో ఉందని ఆయన అన్నారు. ఓటర్ లిస్ట్ లో పేరు ఉందొ లేదో చూసుకోవాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.