విద్యార్థులు, ఆర్టిస్టులతోపాటు చాలా మంది పెన్సిళ్లను ఉపయోగిస్తుంటారు. అయితే సాధారణ పెన్సిళ్లతోపాటు ప్రస్తుతం పేపర్ పెన్సిళ్ల వాడకం కూడా పెరిగిపోయింది. పేపర్ పెన్సిల్ అంటే.. మధ్యలో నీడిల్ ఉండి.. చుట్టూ పేపర్ ఉంటుంది. సాధారణ పెన్సిళ్లలో చెక్కను వాడుతారు.. అంతే తేడా.. ఈ క్రమంలోనే పేపర్ పెన్సిళ్లను తయారు చేసి అమ్మడం వల్ల ఎక్కువ లాభాలను పొందవచ్చు. పెట్టుబడి ఎక్కువగా పెట్టే సామర్థ్యం ఉన్నవారికి ఈ బిజినెస్ చక్కని లాభాలను అందిస్తుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పేపర్ పెన్సిల్ తయారీలో ముందుగా పెన్సిల్ నీడిల్‌ను పేపర్‌లో పెట్టి రోలింగ్ మెషిన్‌తో రోల్ చేస్తారు. దీంతో పెన్సిల్ తయారవుతుంది. ఆ తరువాత పెన్సిల్స్ అన్నింటినీ ఒకే సైజులో కట్ చేసేందుకు గాను కటింగ్ మెషిన్‌ను ఉపయోగిస్తారు. అందులో పెన్సిళ్లను పెట్టి అన్నింటినీ ఒకే సైజు వచ్చేలా కట్ చేస్తారు. అనంతరం థిక్‌నెస్ మెషిన్ సహాయంతో పెన్సిల్ నీడిల్ చుట్టూ రోల్ అయిన పేపర్‌ను మరింత గట్టిగా పట్టి ఉంచేలా చేస్తారు. దీంతో పెన్సిల్ నీడిల్ చుట్టూ ఉన్న పేపర్ చాలా దృఢంగా అయ్యి పెన్సిల్ స్టిఫ్ అవుతుంది. పెన్సిల్ అంత సులభంగా బ్రేక్ కాకుండా ఉంటుంది. థిక్‌నెస్ మెషిన్‌లో వరుసగా పెన్సిళ్లను పెడుతూ.. వాటి చుట్టూ ఉన్న పేపర్‌ను గట్టిగా అయ్యేలా చేస్తారు.
ఇక పెన్సిళ్లపై ఉండే పేపర్ రఫ్‌గా కాకుండా స్మూత్‌గా ఉండేందుకు గాను పాలిషింగ్ మెషిన్‌ను ఉపయోగిస్తారు. అందులో పెన్సిళ్లను పెడితే అవి పాలిష్ అయి బయటకు వస్తాయి. దీంతో వాటిని చేత్తో పట్టుకుంటే స్మూత్‌గా ఉంటాయి. చక్కగా రాసుకోవచ్చు. డ్రాయింగ్ వేసుకోవచ్చు. ఇలా పేపర్ పెన్సిళ్లను తయారు చేయవచ్చు. ఈ క్రమంలో ఈ మెషిన్లన్నింటినీ కొనుగోలు చేయాలంటే.. జీఎస్టీతో కలిపి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది.
అయితే పేపర్ పెన్సిళ్లను తయారు చేయాలంటే.. పేపర్, కమర్షియల్ రెసిన్, గమ్ (అధెసివ్), పెన్సిల్ లెడ్ వంటి ముడి పదార్థాలు అవసరం అవుతాయి. అలాగే లేబర్, రెంట్, విద్యుత్, ఇతర ఖర్చులు కలిపి ఒక్క పేపర్ పెన్సిల్ తయారు చేసేందుకు రూ.1.01 ఖర్చవుతుంది. దాన్ని మార్కెట్‌లో హోల్‌సేల్ ధరకు రూ.1.85 వరకు విక్రయించవచ్చు. దీంతో ఒక్క పెన్సిల్‌పై 84 పైసల లాభం ఉంటుంది. అదే నిత్యం 10వేల పెన్సిళ్లను తయారు చేస్తే.. రూ.8400 వస్తాయి. అదే నెలకు అయితే రూ.2.52 లక్షలు అవుతుంది. ఇలా పేపర్ పెన్సిళ్లను తయారు చేసి విక్రయిస్తూ.. నెల నెలా బోలెడంత ఆదాయం సంపాదించవచ్చు.
ఇక ఈ బిజినెస్‌కు గాను మార్కెటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. స్టేషనరీలు, హోల్ సేల్ వ్యాపారులు, కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్లు.. తదితర వ్యాపారులతో టై అప్ అయితే నిరంతరం పేపర్ పెన్సిల్స్‌ను తయారు చేసి సరఫరా చేయవచ్చు. దీంతో దీర్ఘకాలం పాటు బిజినెస్ చేసి చక్కని లాభాలను పొందవచ్చు..!