బాహుబలి సినిమాతో రమ్యకృష్ణ రేంజ్ మొత్తంగా మారిపోయింది. ఆ సినిమాలో పోషించిన శివగామి పాత్ర జీవితాంతం గుర్తుండిపోవడం తో పాటు ఆ తర్వాత అద్భుతమైన అవకాశాలు చేజిక్కించుకునేందుకు అవకాశం దక్కింది. ప్రభాస్, రానా లతో పాటు సమానంగా రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకి పాపులారిటి దక్కడం గొప్ప విశేషం. అయితే అవకాశాలు ఎక్కువగా సినిమాలకంటే వెబ్ సిరీస్ లలో వస్తుండటం ఎవరూ ఊహించనిది.
కరోనా మహమ్మారితో సినిమా చూడాలంటే థియేటర్స్ లోనే చూడాలి అనే ఆలోచన జనాలలో పోయిందనే చెప్పాలి. లాక్ డౌన్ లో డిజిటల్ ప్లాట్ ఫాంస్ కి విపరీతంగా ఆదరణ దక్కుతోంది. సేఫ్ గా ఇంట్లోనే ఉంటూ తమకి నచ్చిన విధంగా డబ్బు ఆదాతో నచ్చిన సినిమాలని చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇదే ధోరణిలోకి వచ్చేశారు. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా వెబ్ సిరీస్ లను నిర్మించాలని చూస్తునారు. అంతేకాదు సమంత, తమన్న లాంటి స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ వైపు అడుగులు వేస్తున్నారు.
అయితే ఈ విషయంలో అందరికంటే ముందే శివగామి రమ్యకృష్ణ గతేడాదే క్వీన్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయింది. ఈ క్రమంలో రమ్యకృష్ణ వెబ్ సిరీస్ ల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘వెబ్ సిరీస్ ల వల్ల నటులకు వెరైటీ రోల్స్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ కరోనా కారణంగా వెబ్ సిరీస్ కి బాగా డిమాండ్ పెరిగింది. సినిమా కోసం థియేటర్స్ కి జనం వెళ్లడం మానేస్తారా అన్నది అలా ఉంచితే .. వెబ్ సిరీస్ కి కూడా సినిమా స్థాయిలోనే ఆదరణ వస్తుందని మాత్రం చెప్పగలను అన్నారు. అంతేకాదు తనమటుకు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ఆఫర్లు బాగా వస్తున్నాయని రమ్యకృష్ణ తెలిపారు.