దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్‌లోని మోంటే క్యూమాడోకు 104 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. తెల్లవారుజామున 3:39 గంటలకు భూకంపం వచ్చిందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 600 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. కార్డోబాకు 517 కిలోమీట్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొన్నది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. మూడు రోజుల క్రితం.. ఇండోనేసియాలో భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై ఆరు గా నమోదు అయింది. ఈ మేరకు సుమత్రా ద్వీపం తీరంలోని భూకంప కేంద్రం అచే ప్రావిన్స్ లోని సింగ్ కిల్ నగరానికి దక్షిణాగ్నేయంగా 48 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా… అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అలాగే ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు కూడా లేదని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భయపడాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు.