మామూలుగా సముద్రంలో భూకంపం సంభవించడమంటే ఏదో ఒక ఆనార్థానికి దారితీసినట్లే. ఎందుకంటే.. సముద్ర తీర ప్రాంతాల్లో ఏదో ఒకదానిపై సముద్రుడ విరుచుకుపడుతాడని లెక్క. అయితే.. తాజాగా సంభవించిన భూకంపం తీవ్రత తక్కువగా ఉండడంతో అలాంటి ప్రమాదమేది సంభవించలేదు. ఆదివారం మధ్యాహ్నం 2.21 గంటలకు అండమాన్ సముద్రంలోని 40 కిలో మీటర్ల లోతులో ఇది సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎస్‌సీఎస్) తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.6గా నమోదైనట్లు పేర్కొంది. టోంగా దీవులు, ఎలుక దీవులలో కూడా వరుసగా 5.9, 6.2 తీవ్రతతో భూకంపాలు వచ్చినట్లు వివరించింది. అలాగే ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందు కుష్ ప్రాంతంలో 4.6 తీవ్రతతో శనివారం భూకంపం సంభవించినట్లు వెల్లడించింది.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30 వరకు సంభవించిన భూకంపాల సమాచారాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎస్‌సీఎస్) బయట పెట్టింది. ఈ కాలంలో మొత్తం 81 భూకంపాలు నమోదైనట్లు తెలిపింది. ఇందులో 73 భూకంపాలు దేశంతోపాటు పొరుగు ప్రాంతాల్లో సంభవించినట్లు వెల్లడించింది. భారత్‌తోపాటు పొరుగున ఉన్న ప్రాంతాల్లో అత్యధికంగా భూకంపాలు హిందూ కుష్ ప్రాంతం, ఉత్తర లడఖ్, ఉత్తర హిమాచల్ ప్రదేశ్, ఉత్తర జమ్ముకశ్మీర్, ఉత్తర ఉత్తరాఖండ్‌తోపాటు అండమాన్ సముద్రం, అండమాన్-నికోబార్ దీవుల ప్రాంతంలో సంభవించినట్లు ఒక నివేదికలో పేర్కొంది.