హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ శబ్దాలు జనాలను భయబ్రాంతులకు గురి చేశాయి. బోరాబండ, రెహమత్ నగర్,అల్లపూర్ ప్రాంతాల్లో భారీగా వింత వింత శబ్దాలు రావడంతో జనం వణికి పోయారు. భూకంపం వచ్చిందేమో అనుకుని బయటకు పరుగులు తీశారు. భయంతో రాత్రి అంతా ఇంటి బయటనే ఉండి పోయారు. మూడేళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలియగానే పలువురు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
బొరబండ లోని వీకర్స్ కాలనీ, సైడ్ 3 లో భూమి నుంచి భారీ శబ్దాలు వచ్చినట్టు గుర్తించారు. బోరబండ చేరుకున్న జిహెచ్ఎంసి కమిషనర్ అండ్ టీం, పోలీసులు బోరబండ లో భూకంపం రాలేదు, ఎవరూ బయపడొద్దని రాత్రంతా మైకుల ద్వారా చెబుతూనే ఉన్నారు. ఎన్జీఆర్ఐ శాస్త్ర వేత్తలతో మాట్లాడామని, ఒక్కోసారి కొండ ప్రాంతంలో.. భూగర్భ పొరల్లోకి వెళ్లిన నీటి వల్ల శబ్దం రావచ్చని వారు చెబుతున్నారు. రాత్రంతా ఇంటి బయటే ఉన్న జనాలు తెల్లవారుజామున ఇళ్లలోకి చేరుకున్నారు. బోరబండ సైట్ 2 సాయిబాబానగర్ లో మళ్లీ శబ్దాలు మొదలైనట్టు చెబుతున్నారు. అసలు ఏమయింది అనే విషయం ఎవరూ చెప్పలేకపోతున్నారు.